బెంగళూరు: కర్ణాటకలో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి ఇంటికి గుర్తు తెలియని దుండగులు నిప్పు అంటించారు. బళ్లారిలోని కంటోన్మెంట్ ఏరియాలో ఈ ఘటన జరిగింది. అయితే, ఈ ఘటన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన కర్ణాటకలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బళ్లారిలోని బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి మోడల్ హౌస్‌కు గుర్తు తెలియని దుండగులు నిప్పంటించారు. బళ్లారి శివార్లలో రూ.3 కోట్ల విలువైన గాలి జనార్దన్ రెడ్డి మోడల్ హౌస్‌కు నిప్పుపెట్టడం తీవ్ర చర్చకు దారి తీసింది. దుండగులు ఇంటి.. కిటికీలు, తలుపులు పగులగొట్టి పెట్రోల్ పోసి దహనం చేయడంతో ఫర్నిచర్ కాలిపోయింది. అయితే, ఈ ఘటన వెనుక బళ్లారి కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి ఉన్నారని గాలి జనార్ధన్ రెడ్డి సోదరుడు సోమశేఖర్ రెడ్డి ఆరోపించారు. కాగా, ఇంటి నిప్పు పెట్టిన సమయంలో జనార్థన్ రెడ్డి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కర్ణాటక అసెంబ్లీ సమావేశాల నేపధ్యంలో గాలి జనార్థన్ రెడ్డి బెంగళూరులో ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
కాగా, జనవరి ఒకటో తేదీన గాలి జనార్ధన్ రెడ్డి ఇంటి వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి వర్గీయులు కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. ఆ ఘటనపై విచారణ జరుగుతుండగానే బళ్లారిలోని గాలి జనార్ధన్ రెడ్డి మోడల్ హౌస్‌కు నిప్పు పెట్టడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై స్థానిక బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



