పొత్తుల కుమ్ములాట.. అభ్యర్థుల వేట! | Puducherry Polls 2026 Seat Sharing Deadlock Heats Up Ahead Voting | Sakshi
Sakshi News home page

పొత్తుల కుమ్ములాట.. అభ్యర్థుల వేట!

Mar 18 2026 1:03 PM | Updated on Mar 18 2026 1:25 PM

Puducherry Polls 2026 Seat Sharing Deadlock Heats Up Ahead Voting

బంగాళాఖాతం తీరంలో ఉన్న పుదుచ్చేరిలో రాజకీయ వేడి పారాకాష్టకు చేరింది. ఏప్రిల్ 9న జరగనున్న పోలింగ్‌కు గడువు సమీపిస్తున్నా ఇక్కడ ప్రధాన కూటముల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి రాకపోవడం గమనార్హం. ఒకవైపు ఎన్‌డీఏ, మరోవైపు ఇండియా కూటమిలో మిత్ర భేదాలు రచ్చకెక్కుతున్నాయి. నామినేషన్ల పర్వం మొదలైనా అభ్యర్థులెవరో తేల్చుకోలేని అయోమయంలో పార్టీలు కొట్టుమిట్టాడుతున్నాయి.

ఇండియా కూటమిలో ఇలా..

డీఎంకే, కాంగ్రెస్ మధ్య సాగుతున్న అంతర్గత చర్చలు ఇప్పుడు బహిరంగమయ్యాయి. స్థానిక అభ్యర్థులను పొత్తు విషయం అడిగితే ‘అధిష్టానంతో మాట్లాడి చెబుతాం’ అనే సమాధానాలతోనే ముగిస్తున్నారు. 2021 ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకున్నామని, ఈసారి 18 నుంచి 20 సీట్లలో తామే పోటీ చేస్తామని డీఎంకే పట్టుబడుతోంది. సీపీఐ, సీపీఎం, వీసీకే వంటి మిత్రపక్షాలకు 4 సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది.

కాంగ్రెస్ వాదన

తమిళనాడులో డీఎంకే పెద్దన్న పాత్ర పోషించినట్లే పుదుచ్చేరిలో తమకే అగ్రతాంబూలం దక్కాలని కాంగ్రెస్ వాదిస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ తన పట్టును వదులుకోవడానికి సిద్ధంగా లేదు. డీఎంకే దారికి రాకపోతే నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్టి కజగం (టీవీకే) వంటి ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తామనే సంకేతాలను పంపడం గమనార్హం.

ఎన్‌డీఏలో స్థానాల కోసం ఘర్షణ

అధికార ఎన్‌డీయే కూటమిలో సీట్ల పంపకం (బీజేపీకి 14, ఏఐఎన్ఆర్‌సీకి 16) పూర్తయినట్లు కనిపిస్తున్నా క్షేత్రస్థాయిలో అసలు చిక్కులు మొదలయ్యాయి. పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి నేతృత్వంలోని ఏఐఎన్ఆర్‌సీ ఆధీనంలో ఉన్న స్థానాలను బీజేపీ కోరుతుండటంతో పేచీ మొదలైంది. కొన్నిచోట్ల పొత్తు తేలకముందే ఆశావహులు తమకు కేటాయించని స్థానాల్లో కూడా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇది కూటమిలో అంతర్గత గందరగోళానికి దారితీస్తోంది. రంగస్వామికి ఉన్న పీపుల్స్ సీఎం ఇమేజ్‌తో పాటు కేంద్రంలోని బీజేపీ బలాన్ని వాడుకుని మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలని ఎన్‌డీఏ భావిస్తోంది.

గెలుపు గుర్రాలను మార్చే మార్చే ఇతర శక్తులు

పుదుచ్చేరి రాజకీయాల్లో ఈసారి మూడో పార్టీ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. తమిళగ వెట్టి కజగం(టీవీకే) అధినేత, నటుడు విజయ్ పార్టీ బహిరంగ సభలకు యువత భారీగా తరలివస్తుండటం ప్రధాన పార్టీల్లో వణుకు పుట్టిస్తోంది. సీమాన్ నేతృత్వంలోని నామ్ తమిళర్ కట్చి(ఎన్‌టీకే) ఇప్పటికే 28 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి దూసుకుపోతోంది.

సంక్షిప్త విశ్లేషణ.. 2021 ఫలితాలు (మొత్తం 30 సీట్లు)

కూటమి/పార్టీ  గెలిచిన స్థానాలు

ఏఐఎన్‌ఆర్‌సీ    10
బీజేపీ         06 
డీఎంకే       06
కాంగ్రెస్      02
ఇతరులు/స్వతంత్రులు 06

నామినేషన్ల గడువు దగ్గరపడుతున్న తరుణంలో ఈ రాజకీయ చదరంగంలో ఎవరు ఎవరికి చెక్ పెడతారో చూడాలి.

ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement