బళ్లారి గన్‌ ఫైట్‌ ఎపిసోడ్‌లో ట్విస్టులు.. ఎస్పీపై వేటు | Karnataka Clash Over Banners Turns Deadly In Ballari, One Killed, Several Injured And Govt Suspended SP | Sakshi
Sakshi News home page

బళ్లారి గన్‌ ఫైట్‌ ఎపిసోడ్‌లో ట్విస్టులు.. ఎస్పీపై వేటు

Jan 3 2026 8:42 AM | Updated on Jan 3 2026 10:38 AM

 Karnataka Siddaramaiah Govt suspended Ballari SP Over Flexi War

సాక్షి, బళ్లారి: ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టడంలో తలెత్తిన వివాదం కర్ణాటక రాష్ట్రం బళ్లారిలో రణరంగానికి దారితీసింది. గంగావతి  ఎమ్మెల్యే.. మాజీమంత్రి గాలి జనార్దన్‌రెడ్డి, బళ్లారి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి వర్గీయుల మధ్య ఈ వివాదం చెలరేగింది. ఇది చినికి చినికి గాలివానగా మారి చివరకు కాల్పులకు దారితీసింది. కాల్పుల్లో ఒకరు మరణించగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో 144 సెక్షన్‌ విధించగా.. ఇవాళ జరగాల్సిన వాల్మీకి మహర్షి విగ్రహావిష్కరణ కార్యక్రమం వాయిదా వేశారు. అయితే.. 

ఈ ఘటనకు బాధ్యుడ్ని చేస్తూ బళ్లారి ఎస్పీ పవన్ నిజ్జూర్ సస్పెన్షన్‌ వేటు వేసింది కర్ణాటక ప్రభుత్వం. కాల్పుల్లో ఒకరు మరణించడం.. మరొకరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండడం.. వెరసి సకాలంలో కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ప్రభుత్వం ఆయనపై ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. అయితే గురువారమే ఆయన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించగా.. ఛార్జ్ తీసుకున్న కొన్ని గంటల్లోనే సస్పెండ్ కావడంపై పోలీసు వర్గాల్లో చర్చ నడుస్తోంది. 

మరోవైపు.. గాలి జనార్ధన్ రెడ్డి ఇంటి వద్ద జరిగిన పరిణామాలపై ఇటు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నారా భరత్‌ రెడ్డిపైనా కేసు నమోదు అయ్యింది. భరత్‌తో పాటు 40 మంది కాంగ్రెస్‌ కార్యకర్తలపైనా కేసు నమోదు అయినట్లు సమాచారం. ఇప్పటికే ఈ వ్యవహారంలో గాలి జనార్దన్‌తో పాటు 11 మంది బీజేపీ నేతలపైనా కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఇక కాల్పుల ఘటనను తీవ్రంగా పరిగణించిన సీఎం సిద్ధరామయ్య.. సమగ్ర విచారణ జరిపి తనకు నివేదిక ఇవ్వాలని పోలీస్‌ శాఖను ఆదేశించారు.  

వాల్మీకి విగ్రహావిష్కరణ కార్యక్రమం కోసం.. నారా భరత్‌రెడ్డి పేరుతో సిటీలో ఫ్లెక్సీలో వేశారు. గురువారం రాత్రి గాలి జనార్దన్‌రెడ్డి ఇంటి ముందు కూడా బ్యానర్‌ కట్టాలని భరత్‌రెడ్డి అనుచరుడు, కాంట్రాక్టరు సతీశ్‌రెడ్డి మరికొందరు వెళ్లారు. అయితే గాలి అనుచరులు వాళ్లను అడ్డుకున్నారు. ఇదే విషయాన్ని జనార్ధన్‌రెడ్డి కూడా వారికి చెప్పి గంగావతికి వెళ్లిపోయారు. కానీ, సతీష్‌రెడ్డి అక్కడే ఉండి బ్యానర్‌ కట్టాలని తన అనుచరులను ఆదేశించాడు. ఇది తెలిసి మాజీమంత్రి శ్రీరాములు అక్కడికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. పెద్దఎత్తున జనం చేరడంతో గాలి జనార్దన్‌రెడ్డి రాత్రికి మళ్లీ బళ్లారికి తిరిగి వచ్చారు. బీజేపీ–కాంగ్రెస్‌ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరడంతో పరిస్థితి వేడెక్కింది. అంతలోనే ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. 

సతీష్‌రెడ్డి తన ప్రైవేటు గన్‌మెన్‌ వద్ద ఉన్న తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో జనం చెల్లాచెదురు కావడంతో ఘర్షణ పరిస్థితి తలెత్తింది. ఇరు వర్గాలను అదుపుచేసేందుకు పోలీసులు ఎనిమిది రౌండ్ల కాల్పులు జరిపారు. అయితే కాల్పుల్లో కాంగ్రెస్‌ కార్యకర్త రాజశేఖర్‌ మృతి చెందగా.. సతీష్‌రెడ్డికి బుల్లెట్‌ గాయంతో ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై  గాలి జనార్దన్‌రెడ్డి, నారా భరత్‌రెడ్డి పరస్పరం ఆరోపణలు గుప్పించుకున్నారు.

పోలీసులు గాలి జనార్దన్‌రెడ్డి, శ్రీరాములు, గాలి సోమశేఖరరెడ్డికి ఉన్న మొత్తం ఏడుగురు గన్‌మెన్లను పిలిపించి విచారణ జరిపారు. ఈ కాల్పులు జరిపింది ప్రభుత్వం నియమించిన గన్‌మెన్లు కాదని తేల్చారు. అక్కడ ప్రైవేటు వ్యక్తి జరిపిన కాల్పులవల్లే రాజశేఖర్‌రెడ్డి మృతిచెందినట్లు ఇన్‌చార్జి ఎస్పీ రంజిత్‌ బండారి వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement