నీళ్లివ్వాలంటే కుదరదు: మంత్రి జైశంకర్
చెన్నై: మన పొరుగున దుష్టులున్నాయని విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో పౌరులను కాపాడుకొనే హక్కు ప్రభుత్వానికి కచి్చతంగా ఉందని అన్నారు. భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సాహించినంత కాలం నీటిలో మనల్ని వాటా అడిగే హక్కు పొరుగు దేశానికి లేదని స్పష్టంచేశారు. అదే సమయంలో మంచి పొరుగువాళ్లను మనం అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు.
పెట్టుబడులు పెడతామని, వనరులు పంచుకుంటామని, అవసరమైన సాయం అందిస్తామని పేర్కొన్నారు. శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు 4 బిలియన్ డాలర్లు ఇచ్చామని గుర్తుచేశారు. మిత్రదేశాలకు కరోనా ఉధృతి సమయంలో వ్యాక్సిన్లు అందజేశామని వెల్లడించారు. ఇబ్బందుల్లో చిక్కుకున్న ఉక్రెయిన్‌కు ఇంధనం, ఆహారం సరఫరా చేశామని తెలిపారు. శుక్రవారం ఐఐటీ–మద్రాసులో ఓ కార్యక్రమం సందర్భంగా జైశంకర్ మాట్లాడారు.
‘‘దౌత్యం అంటే సులభంగా అర్థం కాని రాకెట్ సైన్స్ అనుకోవద్దు. అది కనీస విచక్షణా జ్ఞానానికి సంబంధించినది. మన పొరుగువాళ్లు మంచివాళ్లు, ఎవరికీ హాని తలపెట్టనివాళ్లు అయితే వారి పట్ల మన ప్రవర్తన దయతో కూడుకొని ఉంటుంది. వారికి సాయం అందించడానికి ఎలాంటి సంకోచం ఉండదు. అదే మన సహజ ప్రవృత్తి. ఒకవేళ పొరుగువాళ్లు చెడ్డవాళ్లు అయితే వారిపట్ల మన ప్రవర్తన కూడా సరిగ్గా అదే రీతిలో ఉంటుంది. మంచివాళ్లతో స్నేహ సంబంధాలు నిర్మించుకోవడానికి ప్రయత్నిస్తాం. అవతలి వ్యక్తులు చెడ్డవాళ్లు అని తెలిసినప్పుడు స్నేహం చేయలేం.
ఇప్పుడు మన పొరుగుదేశం పట్ల అలాగే వ్యవహరిస్తున్నాం’’అని జైశంకర్ స్పష్టంచేశారు. పొరుగుదేశం మనపైకి ఉద్దేశపూర్వకంగా ఉగ్రవాదులను ఎగదోస్తూ ఉంటే.. ఆ ముష్కర మూకల నుంచి మనల్ని పౌరుల్ని రక్షించుకొనే హక్కు మనకు ఉంది. ఆ హక్కును తప్పనిసరిగా వాడుకుంటాం. ఎలా వాడుకోవాలన్నది మన ఇష్టం. ఇతరులెవరూ మనల్ని నిర్దేశించలేరు. మనల్ని కాపాడుకోవడానికి ఏం చేయాలో మనకు తెలుసు. కానీ, పొరుగు దేశం దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ ఉంటే నీళ్లు పంచుకోవడం ఎలా సాధ్యం’’ అని ప్రశ్నించారు.


