
భారత్ విదేశాంగ విధానాలను గౌరవిస్తాం
అమెరికాతో ఇండియా సంబంధం మాకు ప్రామాణికం కాదు
ఐరాస సభలో రష్యా మంత్రి లావ్‌రోవ్ స్పష్టీకరణ
ఐక్యరాజ్యసమితి: భారతదేశ ప్రయోజనాలను, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరించే స్వతంత్ర విదేశాంగ విధానాలను తాము సంపూర్తిగా గౌరవిస్తామని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ పేర్కొన్నారు. అమెరికాతో గానీ మరే ఇతర దేశంతోగానీ భారత్ సంబంధాలు, భారత్, రష్యాల మధ్య సంబంధాలకు ప్రామాణికం కావని స్పష్టం చేశారు. భారత్, రష్యాలు విశేషమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయన్నారు.
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఆయన ఈ మేరకు విస్పష్టంగా ప్రకటించారు. అమెరికా లేదా మరే ఇతర దేశంతో భారత్ సంబంధాల్లో ఏర్పడే ఉద్రిక్తతల ప్రభావం భారత్–రష్యాల మధ్య పడబోదని లావ్‌రోవ్ తెలిపారు. అంతకుముందు, ఆయన మీడియాతో మాట్లాడారు. రష్యా ఆయిల్ కొనరాదంటూ భారత్‌పై అమెరికా చేస్తున్న ఒత్తిడుల నేపథ్యంలో ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు. ‘అమెరికాతో సంబంధాలను గురించి భారతీయ మిత్రులను అడగను. ఇలాంటి విషయాలపై స్వయంగా తీసుకోగల సామర్థ్యం వారికి ఉంది’అని ఆయన అన్నారు.
‘అమెరికా ఒక వేళ మాకు చమురు విక్రయించాలనుకుంటే ఆ విషయంలో ఆ దేశంతో సంప్రదింపులకు మేం సిద్ధం. అంతేతప్ప, ఇతర దేశాల నుంచి మేం ఏం కొనాలి, రష్యాతో ఏం కొనాలి, ఏం కొనకూడదు అనేవి మా సొంత విషయం. దీనికి భారత్–అమెరికా అజెండాతో సంబంధం లేదు’అని అమెరికాకు బదులిచి్చనట్లు జై శంకర్ నాతో అన్నారు. ఆయనది చాలా సరైన సమాధానం, ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే అంశం’అని లావ్‌రోవ్ వివరించారు. రెండు దేశాల మధ్య ఉన్నతస్థాయి సంబంధాలు సాధారణంగానే కొనసాగుతున్నాయన్నారు.
ఈ విషయంలో ఎటువంటి ఇబ్బందీ కలగలేదని తెలిపారు. ఇటీవల చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీవో) సమావేశాల సమయంలో తమ అధ్యక్షుడు పుతిన్, ప్రధాని మోదీ సమావేశమైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్‌లో భారత్‌లో పర్యటించే అవకాశాలున్నాయని లావ్‌రోవ్ వెల్లడించారు. వాణిజ్యం, సైనిక, సాంకేతిక సహకారం, ఆర్థిక, మానవీయ అంశాలు, ఆరోగ్యం, హైటెక్, కృత్రిమ మేధ వంటి అంశాల్లో ద్వైపాక్షిక సంబంధాలతోపాటు, ఎస్‌సీవో, బ్రిక్స్ వంటి అంతర్జాతీయ వేదికలపై రెండు దేశాల మధ్య సన్నిహిత సహకారం కొనసాగుతోందన్నారు. ఐరాస సమావేశాలకు హాజరైన భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌తోనూ లావ్‌రోవ్ భేటీ అయ్యారు. బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రులతో భేటీ అయ్యారు.