అమెరికాలో నివాసం ఉంటున్న ప్రవాస భారతీయులకు ద్వంద్వ పౌరసత్వం కల్పించాలని అక్కడి ప్రవాసీ లీగల్ సెల్ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ప్రవాసీ లీగల్ సెల్ ప్రతినిధులు బుధవారం యుఎస్, హూస్టన్‌లోని ఇండియన్ కాన్సులేట్ కార్యాలయాన్ని సందర్శించారు. ప్రవాసీ లీగల్ సెల్ గ్లోబల్ ప్రతినిధి సుధీర్ తీరునిలత్‌ను కలిసి వినతి పత్రం అందించారు. ద్వంద్వ పౌరసత్వం కల్పించడానికి ఉన్న చట్టపరమైన అంశాలను పరిశీలిస్తామని ఆయన వారికి తెలిపారు
విదేశాల్లో ఉన్న భారతీయులకు తమ మాతృభూమితో సరైన సంబంధాలు ద్వంద్వ పౌరసత్వం ఇవ్వాలని గ్లోబల్ సెల్ ప్రతినిధులు సూచించారు. తద్వారా ప్రవాస భారతీయుల హక్కులను పరిరక్షించడమే కాకుండా భారత్‌కు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఎన్నారైలకు దంద్వ పౌరసత్వం కల్పించే అంశంపై ప్రవాసీ లీగల్ సెల్ తీవ్రంగా కృషి చేస్తోందని లీగల్ సెల్ హెచ్‌ఓసీ ప్రశాంత్ కుమార్ సోనా అన్నారు. కనుక అమెరికాలోని ఎన్నారైలు ఈ పోరాటంలో భాగం పంచుకోవాలని కోరారు.
ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులకు భారత్ ఓసీఐ కార్టు అందజేస్తుంది. ఈ కార్డు ఉన్నవారు జీవిత కాలం పాటు భారత్‌లో పర్యటించవచ్చు. ఆస్తులు కొనుగోలు చేయవచ్చు. కానీ ఓటు హక్కు, రాజకీయ పదవులు, ప్రభుత్వ ఉద్యోగాలకు వీరు అర్హులు కారు. రాజ్యాంగం అమలు సమయం నుంచి భారత్ ఏక పౌరసత్వ విధానాన్ని అనుసరిస్తుంది. అయితే అమెరికా, కెనడా, యూకే లాంటి కొన్ని దేశాలు ద్వంద్వ పౌరసత్వాన్ని అనుమతిస్తాయి.


