ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా | Russia Target Ukraine Places | Sakshi
Sakshi News home page

ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా

Dec 28 2025 7:54 AM | Updated on Dec 28 2025 8:39 AM

Russia Target Ukraine Places

కీవ్‌: ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లోని ఇంధన వనరులు, సైనిక మౌలిక వసతులే లక్ష్యంగా రష్యా శనివారం వేకువజాము నుంచి మరోమారు భారీ దాడులకు తెరతీసింది. కింఝాల్‌ హైపర్‌సోనిక్‌ క్షిపణులు, డ్రోన్లను పెద్ద సంఖ్యలో ప్రయోగించింది. బాంబు మోతలతో కీవ్‌ కొన్ని గంటలపాటు ప్రతిధ్వనించింది. వివిధ ఘటనల్లో కనీసం ఒకరు చనిపోయారు. 32 మంది గాయపడ్డారు.

కాగా, ఉక్రెయిన్‌ యుద్ధం ముగించేందుకు ఓవైపు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నా, రష్యా మాత్రం తన దాడులను ఆపడం లేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ఆదివారం ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కలవనున్న నేపథ్యంలోనే ఈ భారీ దాడి జరగడం గమనార్హం. చర్చల్లో ప్రధానంగా భద్రతా హామీలపైనే పట్టుబడతామని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. రష్యా దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. శాంతి చర్చలకు ముందు జరిగిన ఈ దాడి పుతిన్‌ మనస్తత్వాన్ని తెలియజేస్తుందని అన్నారు.

ఇక, రష్యా మాత్రం.. భూమి, వాయు, సముద్ర మార్గాల్లో కీవ్‌పై లాంగ్‌ రేంజ్‌ ప్రెసిషన్‌ గైడెడ్‌ ఆయుధాలతో భారీ దాడి చేపట్టినట్లు ఉక్రెయిన్‌ రక్షణ శాఖ పేర్కొంది. మొత్తం 519 డ్రోన్లు, 40 వరకు క్షిపణులను రష్యా ప్రయోగించిందని ఉక్రెయిన్‌ వైమానిక దళం తెలిపింది. దాడుల ఫలితంగా కీవ్‌లోని చాలా ప్రాంతాలకు విద్యుత్‌ సరఫరా బంద్‌ అయినట్లు వెల్లడించింది. దాడుల్లో పది వరకు బహుళ అంతస్తుల నివాస భవనాలు దెబ్బతిన్నాయని, కొన్ని చోట్ల అగ్ని ప్రమాదాలు సంభవించాయని వివరించింది. మరోవైపు.. తాము ఉక్రెయిన్‌ ఇంధన, మిలిటరీ సదుపాయాలే లక్ష్యంగా దాడులు చేపట్టామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కీవ్‌ తమ దేశంలోని జనావాసాలపై చేసిన దాడులకిది ప్రతీకారమని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement