దాదాపు నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్ సంక్షోభానికి ముగింపు దిశగా కీలక అడుగు పడింది. ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందం విషయంలో.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీతో జరిపిన భేటీ ఫలవంతంగా ముగిసింది. తుది ఒప్పందాన్ని అధికారికంగా ప్రకటించకపోయినా.. ఇద్దరు దేశాధినేతలు చర్చలు కీలక దశకు చేరుకున్నాయనే సంకేతాలు మాత్రం ఇచ్చారు. కానీ..
ఫ్లోరిడాలోని తన మార్ ఎ లాగో నివాసంలో సుమారు మూడు గంటలపాటు ట్రంప్ జెలెన్‌స్కీతో చర్చలు జరిపారు. శాంతి ఒప్పందానికి 90-95 శాతం ఆమోదం లభించిందని ఇరువురు నేతలు ప్రకటించారు. అయితే కీలకమైన సరిహద్దు అంశంపైనే ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదని ఇద్దరి మాటల్లో వెల్లడి అయ్యింది.
ఉక్రెయిన్‌కు భద్రత కల్పించే అంశాలపై 95 శాతం చర్చలు పూర్తయ్యాయని ట్రంప్ అన్నారు. అయితే.. తూర్పు భాగంలోని సరిహద్దుల అంశమే ఎటూ తేలడం లేదని మీడియా ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘చాలా అంశాలపై చర్చించాం. దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్లే అనుకోవచ్చు. గతంతో పోలిస్తే ఇది ఎంతో మెరుగైన ఫలితం. మరికొన్ని వారాల్లోనే ఈ యుద్ధం ముగిసే అవకాశం ఉంది. అయితే ఈ చర్చలకు డెడ్‌లైన్ అంటూ ఏదీ లేదని గమనించాలి. కాబట్టి సరైన సమయంలో.. అదీ అమెరికా సమక్షంలో రష్యా-ఉక్రెయిన్‌లు ఈ యుధ్దానికి ముగింపు పలుకుతాయి’’ అని అన్నారాయన.
ఇక ట్రంప్‌కు మరోసారి కృతజ్ఞతలు తెలియజేసిన జెలెన్‌స్కీ.. ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల ప్రణాళికలో ఇరువైపులా సంబంధించిన అంశాలను పొందుపరిచారని.. ఇందులో 90 శాతం ఆమోదయోగ్యంగానే ఉన్నాయన్నారు. అయితే అంతిమంగా.. శాశ్వత శాంతి సాధనలో భద్రతా హామీలే కీలకమైన మైలురాయిగా అభివర్ణించారు. మిగిలిన అంశాలపై యూరోపియన్ యూనియన్ ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతామని.. జనవరిలో వాషింగ్టన్‌లో మరిన్ని చర్చలు జరుగుతాయని.. త్వరలోనే ట్రంప్ పీస్ ప్లాన్‌కు తుది రూపం ఇవ్వనున్నట్లు జెలెన్‌స్కీ చెప్పారు.
ట్రంప్ మాట్లాడుతూ.. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ యుద్ధానికి తాత్కాలికంగా ఆపేందుకు సుముఖంగా లేరు. అందుకే ఆయన కాల్పుల విరమణకు అంగీకరించలేదు. ఉక్రెయిన్‌లో పర్యటించాలని, అక్కడి పార్లమెంట్‌లో ప్రసంగించాలని తాను కోరుకుంటున్నప్పటికీ.. ముందుగా శాంతి ఒప్పందం ఓ కొలిక్కి రావాలని జెలెన్‌స్కీ ఆకాంక్షిస్తున్నారని, ఆ అభిప్రాయాన్ని తాను గౌరవిస్తాను అని అన్నారు.
అసలు చిక్కల్లా అక్కడే..
డోన్బాస్ (Donbas) అనేది తూర్పు ఉక్రెయిన్‌లోని ఒక చారిత్రక.. ఆర్థిక ప్రాంతం. డొనెట్స్క్ (Donetsk), లుహాన్స్క్ (Luhansk) ప్రాంతాల కలయిక. అందుకే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కేంద్ర బిందువుగా మారింది. రష్యా అనుకూల వేర్పాటువాదులకు, ఉక్రెయిన్‌కు మధ్య ఈ ప్రాంతంపై పట్టు కోసం తీవ్ర పోరాటం జరుగుతోంది. వ్యూహాత్మకంగా భావిస్తుండడంతో.. రష్యా దీనిని తమ భూభాగంగా ప్రకటించుకుంటోంది. అందుకే శాంతి చర్చలలో కీలక అంశంగా మారింది. అయితే.. ఈ అంశంపైనా చర్చలు దాదాపు కొలిక్కి వచ్చినట్లేనని ట్రంప్ ఇప్పుడు చెబుతుండగా, డోన్బాస్‌పై ఉక్రెయిన్ వైఖరి స్పష్టంగా ఉందని.. అది రష్యా అభిప్రాయానికి భిన్నమని వ్యాఖ్యానించడం కొసమెరుపు.
భేటీకి ముందు..
జెలెన్‌స్కీతో భేటీకి ముందు మీడియాతో ట్రంప్ మాట్లాడుతూ.. తుది గడువు ఏమీ లేదని, యుద్ధం ముగింపుపైనే దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. దౌత్య ప్రయత్నాలు తుది దశకు వచ్చినట్లు పేర్కొన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తోనూ ఫోన్‌లో మాట్లాడానని.. ఆయనతో ఫలితం సాధించే దిశగా చర్చలు జరిగినట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు.
‘‘రష్యా, ఉక్రెయిన్ శాంతిని కోరుకుంటున్నాయి. నేను జెలెన్‌స్కీతో జరుపుతున్న సమావేశంపై పుతిన్ చిత్తశుద్ధితో ఉన్నారు. తుది గడువు ఏమీ లేదు.. యుద్ధం ముగింపుపైనే దృష్టి సారిస్తున్నాం. ప్రస్తుత పరిస్థితులపై పుతిన్, జెలెన్‌స్కీ ఒప్పందం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల చాలా మంది చనిపోయారు. ఇప్పటికే 8 యుద్ధాలు ఆపాను.. ఇదీ చాలా క్టిష్టమైనది. ఫ్లోరిడాలో సమావేశం కోసం జెలెన్‌స్కీ చాలా కృషి చేశారు. ఆయన, ఉక్రెయిన్ ప్రజలు చాలా ధైర్యవంతులు. రష్యా, ఉక్రెయిన్ పరిస్థితులపై చర్చలు కొనసాగిస్తుంటాం. చర్చలు చివరి దశలో ఉన్నాయి.. ఏం జరుగుతుందో చూద్దాం’’ అని ట్రంప్ అన్నారు.
ట్రంప్‌తో జరిగే సమావేశంలో ఉక్రెయిన్‌కు కల్పించాల్సిన భద్రతా హామీల అంశాన్ని లేవనెత్తనున్నట్లు ఇది వరకే జెలెన్‌స్కీ వెల్లడించారు. ముఖ్యంగా 20సూత్రాల ప్రణాళికపై చర్చిస్తామని, ఇది దాదాపుగా(90 శాతం) సిద్ధమైందని తెలిపారు. ఈ సమావేశంలో ఉక్రెయిన్, అమెరికా మాత్రమే కాకుండా యూరప్ దేశాలూ పాలుపంచుకోవాలని తాను భావిస్తున్నట్లు చెప్పారు.


