
బ్రిక్స్ విదేశాంగ మంత్రుల ఆందోళన
ఐక్యరాజ్యసమితి/న్యూయార్క్: విచక్షణారహితంగా టారిఫ్‌లను విధిస్తూ వాణిజ్య నియంత్రణ చర్యలకు పాల్పడటంపై బ్రిక్స్ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇటువంటి నిర్బంధపూరిత విధానాలతో గ్లోబల్ సౌత్ దేశాలను అణగదొక్కే ప్రమాదముందని హెచ్చరించాయి. ప్రపంచ వాణిజ్యాన్ని మరింత తగ్గించి, ప్రపంచ సరఫరా గొలుసులను దెబ్బతీసి, అంతర్జాతీయ ఆర్థికవాణిజ్య కార్యకలాపాలలో అనిశి్చతిని కల్పిస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది.
ఇటువంటి రక్షణాత్మక చర్యలు ప్రస్తుత ఆర్థిక అసమానతలను మరింత తీవ్రతరం చేయడంతోపాటు ప్రపంచ అభివృద్ధి అవకాశాలను ప్రభావితం చేస్తాయని పేర్కొంది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వార్షిక సమావేశాలకు హాజరైన బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రులు భారత్ అధ్యక్షతన శుక్రవారం న్యూయార్క్‌లో భేటీ అయ్యారు. 2026లో బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలను భారత్ చేపట్టనుండటం తెల్సిందే. భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ అధ్యక్షతన భేటీ జరిగింది. అనంతరం మంత్రులు అమెరికా ప్రభుత్వం, అధ్యక్షుడు ట్రంప్ పేరును ప్రస్తావించకుండా ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ఈ సమావేశం పహల్గాం ఉగ్రదాడిని కూడా ఖండించింది.