దీర్ఘకాలంగా మిత్రదేశాలుగా ఉన్న సౌదీ అరేబియా... యూఏఈల మధ్య ఘర్షణలు చెలరేగడంతో మధ్య ప్రాచ్య దేశాల్లో అలజడి చెలరేగింది. అంతగా స్నేహంగా ఉన్న దేశాల మధ్య ఒక్కసారిగా విబేధాలు రావడానికి యెమన్ దేశమే కారణమైంది. 9 ఏళ్లుగా యెమన్‌లో యుఏఈ మద్దతు ఇస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్న సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ అనే వేర్పాటువాద గ్రూప్. ఆ గ్రూప్‌ను యెమన్ దేశంతో పాటు... సౌదీ అరేబియా వ్యతిరేకిస్తోంది. కానీ... యూఏఈ మాత్రం ఆ గ్రూప్‌ను సమర్థిస్తోందన్న అనుమానాలు బలంగా ఉన్నాయి. సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ పేరిట పుట్టిన వేర్పాటు వాద గ్రూప్... అంతర్గత కలహాలు సృష్టిస్తూ యెమెన్‌లోని ప్రధాన దక్షిణ వేర్పాటువాదం కోసం పోరాడుతోంది. ముఖ్యంగా యెమెన్ దక్షిణ ప్రాంతానికి స్వతంత్రత సాధించాలనే లక్ష్యంతో పని చేస్తున్న ఈ గ్రూప్ 2017లో పుట్టింది.
వేర్పాటు వాదులకు మద్దతు ఇస్తోందన్న అనుమానంతో సౌదీకి కోపం వచ్చింది. దీంతో సౌదీ బలగాలు నేరుగా డిసెంబర్ ౩౦న యెమెన్‌లోని ముకల్లా పోర్ట్ నగరంపై దాడి చేయగా... యుఏఈ దీనిని తీవ్రంగా ఖండించింది. అంతే కాకుండా అక్కడ ఉన్న యూఏఈ సైన్యాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. యెమన్‌పై జరిగిన దాడితో పాత మిత్రుల మధ్య పుట్టుకొచ్చిన వ్యతిరేకతను దూరం చేయడానికి గల్ఫ్ దేశాలు సమాలోచనలు చేస్తున్నాయి. మరోవైపు దాడి జరగ్గానే యెమన్‌లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు.
యెమన్‌లోని వేర్పాటు వాదులకు యూఏఈ నుంచి ఆయుధాలు అందుతన్నాయన్న ఆగ్రహం వ్యక్తం చేస్తూ... యెమెన్‌లోని ముకల్లా పోర్ట్‌పై సౌదీ సైన్యం వైమానిక దాడులు జరిపింది. దాడిని యూఏఈ ఖండిస్తూ... సౌదీ ఆరోపణలు నిరాధారమైనవని.. అసలు వారి వద్ద ఆయుధాలే లేవని యూఏఈ స్పష్టం చేసింది. అనాలోచిత దాడి అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ యెమన్‌లో ఉన్న యూఏఈ సైన్యాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఇది ఊహించని పరిణామమని గల్ఫ్ దేశాలు చెబుతున్నాయి. అయితే అక్కడ చెలరేగిన యూఏఈ- సౌదీ మధ్య విబేధాలు ఇటు మన దేశంపై కూడా ప్రభావం చూపే అవకాశముంది. ఆ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఆర్థిక భద్రత, భారత్‌కు అందే ఇంధన సరఫరా, ప్రవాస భారతీయుల సంక్షేమాలపై ప్రభావం చూపే అవకాశముంది.
తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ గురించి ఇతర దేశాల్లో అలజడి ప్రారంభమైంది. యెమన్‌లో మళ్లీ సౌదీ ప్రభుత్వం సైనిక చర్యలకు పాల్పడే అవకాశం లేకపోలేదని... దీంతో గల్ఫ్ దేశాల్లో ప్రధానమైన సౌదీ అరేబియా- యూఏఈల మధ్య ఘర్షణ ముదిరితే.. యెమన్, యూఏఈతో పాటు ఇతర దేశాలకూ ముప్పు తప్పదనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి. గల్ఫ్‌లో ఉద్రిక్తతలు పెరిగితే వాటి ప్రభావం నేరుగా చమురు ధరలపై పడుతుంది. భారత్ లో ప్రవాస భారతీయుల భద్రత, భారత్‌కు ఇంధన సరఫరా, వాణిజ్య సంబంధాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని మన ప్రభుత్వం ఆలోచిస్తోంది.
-మహమ్మద్ అబ్దుల్ ఖదీర్


