లాస్ ఏంజెల్స్: భద్రతా కారణాలు, ఉగ్రదాడుల ముప్పు కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల్లో నూతన సంవత్సర వేడుకలు రద్దు చేశారు. లాస్ ఏంజెల్స్‌లో వరుస బాంబు దాడులే లక్ష్యంగా కుట్ర పన్నిన నలుగురిని ఎఫ్‌బీఐ అరెస్టు చేసింది. ఈ క్రమంలో ఎఫ్‌బీఐ వివిధ దేశాలు హెచ్చరికలు జారీ చేసింది.
ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలోని బోండై బీచ్‌లో ఇటీవల జరిగిన కాల్పుల్లో 15 మంది మరణించగా, 40 మందికి గాయపడ్డారు. ఈ నేపథ్యంలో, 15,000 మందికి పైగా పాల్గొనే బోండై బీచ్‌లోని పటాకుల ప్రదర్శనతో పాటు ఇతర వేడుకలు రద్దయ్యాయి. యూదుల భద్రత దృష్ట్యా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
పారిస్‌లోని షాంప్స్-ఎలీసీ వద్ద ప్రసిద్ధ సంగీత కార్యక్రమాన్ని పోలీసులు సూచన మేరకు రద్దు చేశారు. భారీ జనసమూహం, ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని ముందస్తు జాగ్రత్త చర్యగా కార్యక్రమాన్ని రద్దు చేశారు. అయితే అధికారిక పటాకుల ప్రదర్శన మాత్రం జరుగుతుంది.
టోక్యోలోని షిబుయా స్టేషన్ వెలుపల జరిగే ప్రపంచ ప్రసిద్ధ నూతన సంవత్సరం కౌంట్‌డౌన్ రద్దు చేశారు. భారీ రద్దీ కారణంగా గందరగోళ పరిస్థితులు ఏర్పడే ఆవకాశముందని అధికారులు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడాన్ని నిషేధించారు. అయితే, న్యూయార్క్ నగరంలోని ప్రసిద్ధ టైమ్స్ స్క్వేర్ బాల్ డ్రాప్ మాత్రం ముందుగా నిర్ణయించిన ప్రకారం జరుగుతుందని అధికారులు వెల్లడించారు.


