అంతర్జాతీయ వాణిజ్య వేదికపై భారత్, చైనాల మధ్య విభేదాలు మరోసారి ముదిరాయి. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) ఉత్పత్తులు, సోలార్ రంగంలో భారత్ అందిస్తున్న సబ్సిడీలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ చైనా ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ)లో పిటిషన్ దాఖలు చేసింది. ఈ ఏడాది భారత్‌కు వ్యతిరేకంగా చైనా డబ్ల్యూటీఓను ఆశ్రయించడం ఇది రెండోసారి కావడం గమనార్హం.
చైనా ప్రధాన ఆరోపణలు
బీజింగ్‌లోని వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, భారత్ అనుసరిస్తున్న విధానాలు అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని చైనా ఆరోపించింది. భారత ప్రభుత్వ చర్యలు నేషనల్ ట్రీట్‌మెంట్ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని తెలిపింది. ఇది డబ్ల్యూటీఓ నిబంధనల ప్రకారం నిషేధించిన దిగుమతి ప్రత్యామ్నాయ రాయితీలను అనుసరిస్తుందని పేర్కొంది. భారత్ తన దేశీయ పరిశ్రమలకు నిబంధనలకు విరుద్ధంగా సబ్సిడీలు ఇస్తూ చైనా ప్రయోజనాలను దెబ్బతీస్తోందని తెలిపింది. తద్వారా భారతీయ కంపెనీలకు అన్యాయమైన పోటీ ప్రయోజనం కలుగుతోందని వాదించింది. డబ్ల్యూటీఓ కట్టుబాట్లను గౌరవించి ఈ రాయితీలను వెంటనే ఉపసంహరించుకోవాలని లేదా సర్దుబాటు చేయాలని చైనా భారత్‌ను కోరింది.
భారత్ వాదన
చైనా ఫిర్యాదుపై భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే, ఈ పరిణామాలపై అవగాహన ఉన్న ఉన్నతాధికార వర్గాల సమాచారం ప్రకారం.. అంతర్జాతీయ వాణిజ్యంలో దేశాలు పరస్పరం సబ్సిడీలు, సుంకాలను ప్రశ్నించుకోవడం సాధారణమేనని అభిప్రాయపడుతున్నారు. దేశీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి, స్వయం సమృద్ధి సాధించడానికి కొన్ని రంగాలు, ముఖ్యంగా పునరుత్పాదక ఇంధనం (సోలార్), ఐటీ హార్డ్‌వేర్ రంగాలకు ప్రోత్సాహకాలు అవసరమని భారత్ చెబుతోంది. భారత్ ప్రవేశపెట్టిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు(ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్-పీఎల్‌ఐ) తయారీ రంగాన్ని పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నాయని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో అవి నిబంధనలకు లోబడే ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు.
వరుస ఫిర్యాదులతో పెరుగుతున్న ఉత్కంఠ
గత అక్టోబర్‌లో కూడా ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ), బ్యాటరీ రంగాల్లో భారత్ ఇస్తున్న సబ్సిడీలపై చైనా డబ్ల్యూటీఓలో ఫిర్యాదు చేసింది. గ్రీన్ ఎనర్జీ, హైటెక్ తయారీ రంగాల్లో ప్రపంచ ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరాటంలో భాగంగానే చైనా ఈ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డబ్ల్యూటీఓ నిబంధనల ప్రకారం, రెండు దేశాలు సంప్రదింపుల ద్వారా ఈ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. ఒకవేళ చర్చలు విఫలమైతే డబ్ల్యూటీఓ వివాద పరిష్కార కమిటీ ఈ అంశంపై విచారణ జరుపుతుంది.
ఇదీ చదవండి: ‘ఫ్లెక్స్’ క్రెడిట్ కార్డ్‌తో యూపీఐ చెల్లింపులు.. ప్రత్యేకతలివే..


