భారతదేశ డిజిటల్ చెల్లింపుల రంగంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ పే, ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ సంయుక్తంగా ‘గూగుల్ పే ఫ్లెక్స్’ (Google Pay Flex) క్రెడిట్ కార్డును ప్రారంభించాయి. రూపే నెట్‌వర్క్‌తో పనిచేసే ఈ కార్డ్ వినియోగదారులకు నేరుగా యూపీఐ ఎకోసిస్టమ్ ద్వారా క్రెడిట్ సౌకర్యాన్ని అందించనుంది. ఇండియాలో ఇలాంటి కార్డు అందులోబాటులోకి తీసుకురావడం ఇదే మొదటిసారి.
యూపీఐ సౌలభ్యం..
ప్రస్తుతం భారత్‌లో యూపీఐ చెల్లింపులు సర్వసాధారణం అయ్యాయి. క్రెడిట్ కార్డును యూపీఐకి అనుసంధానించి చెల్లింపులు చేసే వెసులుబాటును ఈ కొత్త కార్డ్ మరింత సులభతరం చేస్తోంది. ప్రజలు ప్రతిరోజూ చేసే యూపీఐ చెల్లింపుల్లో క్రెడిట్ వినియోగాన్ని సులభతరం చేయడమే తమ లక్ష్యమని గూగుల్, యాక్సిస్ బ్యాంక్ ప్రతినిధులు సంయుక్త ప్రకటనలో తెలిపారు.
ప్రత్యేకతలు ఇవే..
ఈ కార్డు ద్వారా చేసే ప్రతి లావాదేవీకి రివార్డ్ పాయింట్లు లభిస్తాయి.
ఇందులో ఒక పాయింట్ ఒక రూపాయి నిష్పత్తిలో ఉంటుంది.
పాయింట్ల రెడీమ్ కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా గూగుల్ పే ద్వారా తక్షణమే రీడీమ్ చేసుకోవచ్చు.
ఈ కార్డు కోసం దరఖాస్తు చేయడం చాలా సులభం. ఎటువంటి పేపర్ వర్క్ లేకుండా గూగుల్ పే యాప్‌లోనే ఎలాంటి ఖర్చు లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆమోదం పొందిన నిమిషాల్లోనే వర్చువల్ కార్డ్ యాక్టివేట్ అవుతుంది.
పెద్ద మొత్తంలో చేసే ఖర్చులను వినియోగదారులు తమ గూగుల్ పే డాష్‌బోర్డ్ నుంచే నేరుగా ఈఎంఐలుగా మార్చుకోవచ్చు. దీనివల్ల ఆర్థిక భారం తగ్గుతుంది.
కార్డును బ్లాక్ చేయడం, అన్‌బ్లాక్ చేయడం, పిన్ మార్చుకోవడం లేదా ఖర్చు పరిమితులను సెట్ చేసుకోవడం వంటివన్నీ గూగుల్ పే యాప్ నుంచే నిర్వహించవచ్చు.
ఈ సందర్భంగా యాక్సిస్ బ్యాంక్ కార్డ్స్ అండ్ పేమెంట్స్ హెడ్ ఆర్నికా దీక్షిత్ మాట్లాడుతూ.. ‘మారుతున్న భారతీయుల డిజిటల్ ఖర్చుల అలవాట్లను దృష్టిలో ఉంచుకుని దీన్ని రూపొందించాం. యాక్సిస్ బ్యాంక్ బ్యాంకింగ్ నైపుణ్యం, గూగుల్ పే సాంకేతికత కలిసి వినియోగదారులకు భద్రతను, సౌకర్యాన్ని అందిస్తాయి’ అని పేర్కొన్నారు.
భద్రతకు పెద్ద పీట
భౌతిక కార్డులు పోతాయనే భయం లేకుండా ఈ ‘డిజిటల్-ఫస్ట్’ డిజైన్ భద్రతను పెంచుతుంది. గూగుల్ పే లో ఉండే బహుళ స్థాయుల ఆథెంటికేషన్ కారణంగా లావాదేవీలు సురక్షితంగా జరుగుతాయని అధికారులు చెబుతున్నారు. రూపే నెట్‌వర్క్ కావడం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది చిరు వ్యాపారుల వద్ద కూడా ఈ కార్డును స్కాన్ చేసి పేమెంట్స్ చేయవచ్చు. ముఖ్యంగా యువతను, టెక్నాలజీని ఎక్కువగా వాడే తరాన్ని లక్ష్యంగా చేసుకుని తెచ్చిన ఈ ‘ఫ్లెక్స్’ కార్డ్ క్రెడిట్ కార్డుల వాడకాన్ని మరింత పెంచుతుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: ప్రారంభంలో ఆశావాహం.. సవాళ్ల సుడిగుండం!


