నానాటికీ పెరుగుతున్న యూపీఐ పేమెంట్స్
డిసెంబర్ 1న రూ.1,15,450 కోట్ల లావాదేవీలు
ఇదే నెలలో 8 రోజులు రూ.1 లక్ష కోట్లు దాటిన వైనం
గ్రాసరీస్, సూపర్ మార్కెట్లలో ఎక్కువ వినియోగం
కొనసాగుతున్న ఫోన్‌పే జోరు
స్కానర్ ఉందా? క్యాబ్, దుకాణం, తోపుడు బండి.. ఎవరికి డబ్బులు చెల్లించాలన్నా చాలావరకు కస్టమర్లు అడిగే ప్రశ్న ఇది. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) వినియోగ విస్తృతి చూస్తుంటే భవిష్యత్తులో నగదు చెల్లింపులు అసలే ఉండవా అని అనిపిస్తుంది. దేశవ్యాప్తంగా యూపీఐ ఆధారిత పేమెంట్స్ ఒక్కరోజులో రూ.1 లక్ష కోట్లకు పైగానే జరుగుతున్నాయంటే పరిస్థితి అర్థమవుతోంది. దేశంలో మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ వినియోగం అధికం అవుతోంది. జనం డిజిటల్ చెల్లింపులకు అలవాటు పడ్డారు.

వ్యక్తుల నుంచి వ్యక్తులకు, వ్యక్తుల నుంచి వర్తకులకు క్యూఆర్ కోడ్, మొబైల్ నంబర్, బ్యాంకు ఖాతాకు క్షణాల్లో డబ్బులు పంపగలిగే అవకాశం ఉండడంతో యూపీఐ మన దేశంలో దూసుకుపోతోంది. సరుకుల కొనుగోళ్లకు ఈ తరహా చెల్లింపులు ఎక్కువగా ఉంటుండగా, సూపర్ మార్కెట్లు అత్యధిక లావాదేవీలకు వేదిక అవుతున్నాయి. లావాదేవీలు, విలువలో ‘ఫోన్‌పే’తన హవా కొనసాగిస్తూనే ఉంది. రాష్ట్రాల వారీగా చూస్తే యూపీఐ వినియోగంలో మహారాష్ట్ర ముందుంది. టాప్–6 రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా ఉండటం గమనార్హం.

ఈ ఏడాది మార్చిలో తొలిసారిగా..
యూపీఐ ప్లాట్‌ఫామ్‌పై రోజువారీ చెల్లింపులు 2025 మార్చి 1న తొలిసారిగా రూ.1 లక్ష కోట్ల మార్కు దాటింది. ఆ రోజు రూ.1,01,628 కోట్ల పేమెంట్స్ జరిగాయి. ఇక డిసెంబర్ 1న ఏకంగా రూ.1,15,450 కోట్లు నమోదు చేసి సరికొత్త గరిష్టాలను తాకింది. 2024 డిసెంబర్‌లో సగటున రోజుకు రూ.75,800 కోట్ల విలువైన చెల్లింపులు జరిగాయి. కాగా 2025 డిసెంబర్‌లో (1–30 మధ్య) ఇది రూ.89,481 కోట్లకు చేరింది. డిసెంబర్‌లో మొత్తం రూ.26,84,446 కోట్ల విలువైన 2,086 కోట్ల లావాదేవీలు జరిగాయి. యూపీఐ ప్లాట్‌ఫామ్‌పై 2025 డిసెంబర్‌లో 8 రోజులు రూ.1 లక్ష కోట్లకు పైగా చెల్లింపులు జరగడం విశేషం.


