రూ.10, రూ.20, రూ.50 నోట్లు అందుబాటులో ఉంచడంపై కేంద్రం దృష్టి
ముంబైలో ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు .. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయడంపై త్వరలో నిర్ణయం
సాక్షి, స్పెషల్ డెస్క్ : డిజిటల్ పేమెంట్స్ ఎప్పటికప్పుడు కొత్త రికార్డులను నమోదు చేస్తున్నా.. ఇప్పటికీ నగదు లావాదేవీలు భారతీయుల దైనందిన జీవితంలో భాగంగానే ఉన్నాయి. చిన్న నోట్లతోముడిపడిన లావాదేవీలు ఎక్కువగానే జరుగుతున్నాయి. అయితే మార్కెట్లో చిన్న నోట్ల కొరత తీవ్రంగా ఉంది. ఇందుకు పరిష్కారంగా రూ.10, రూ.20 నాణేలను విరివిగా ప్రవేశపెట్టిన జనం నుంచి వీటికి స్పందన అంతంతే ఉంది. ఈ నేపథ్యంలో తక్కువ విలువ కలిగిన కరెన్సీ నోట్లను మరింత విస్తృతంగాఅందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం పలు మార్గాలను అన్వేషిస్తోంది.
ఇళ్లకే పరిమితం అవుతున్న నాణేలు!
తక్కువ విలువ కలిగే కరెన్సీ నోట్ల కొరతకు చెక్ పెట్టేందుకు, అలాగే మన్నికగా ఉంటాయన్న భావనతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కొన్నేళ్లుగా రూ.10, రూ.20 కాయిన్స్ వైపు మొగ్గు చూపుతోంది. నోట్లకు అలవాటు పడిన జనం ఈ కాయిన్స్‌ను తీసుకుంటున్నా అవి తిరిగి చలామణి వ్యవస్థలోకి రావడం లేదు. చాలావరకు ఇళ్లకే పరిమితం అవుతున్నాయని ఓ బ్యాంక్ ఉన్నతాధికారి సాక్షికి తెలిపారు.
కాగా ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ సమస్యపై దృష్టి సారించింది. రూ.10, రూ.20, రూ.50 నోట్లను జారీ చేయడానికి కొత్త రకమైన ఏటీఎంలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. డిమాండ్‌ను తీర్చడానికి చిన్న కరెన్సీ నోట్లను పెద్ద ఎత్తున ముద్రించాల్సిందిగా ఆర్‌బీఐని కోరాలని భావిస్తోంది. అలాగే పెద్ద నోట్లను డిపాజిట్ చేస్తే చిన్న నోట్లు, నాణేలను ఇచ్చే హైబ్రిడ్ ఏటీఎంలను కూడా ప్రవేశపెట్టనుంది.
పరిశీలనలో హైబ్రిడ్ ఏటీఎం పనితీరు
తక్కువ విలువ కలిగిన కరెన్సీ నోట్లను పంపిణీ చేసే నమూనా యంత్రాలను ప్రస్తుతం ముంబైలో పైలట్ ప్రాజెక్టు కింద పరీక్షిస్తున్నారు. ఈ ఏటీఎంలకు ఆమోదముద్ర పడితే వీటిని దేశవ్యాప్తంగా ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, మార్కెట్లు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాల వంటి జనం ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో వీటిని ఏర్పాటు చేస్తారు.
మరోవైపు బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన ముంబై శాఖలో హైబ్రిడ్ ఏటీఎం పనితీరును ఆర్‌బీఐ పరిశీలించింది. ముంబై పైలట్ ఫలితాలను సమీక్షించడంతో పాటు ఆర్‌బీఐ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఈ ఏటీఎంలను బ్యాంకుల ద్వారా విస్తృతంగా అందుబాటులోకి తెచ్చే అంశంపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అధికారవర్గాలుచెబుతున్నాయి.
» ఆర్‌బీఐ గణాంకాల ప్రకారంప్రస్తుతం దేశవ్యాప్తంగాచలామణిలో ఉన్న కరెన్సీలోపరిమాణం పరంగా 41.2% వాటా రూ.500 నోట్లదే. విలువలో 86% వాటాతో ఈ పెద్ద నోటు ఆధిపత్యం చెలాయిస్తోంది.
» రూ.2, రూ.5, రూ.10, రూ.20, రూ.50 నోట్లు మొత్తం కరెన్సీలో పరిమాణం పరంగా 38% వాటాఉంటాయి. విలువలో 3.1% మాత్రమే.
» 2016 నవంబర్ 4 నాటికి చలామణిలో ఉన్న కరెన్సీ విలువ రూ.17.97 లక్షల కోట్లు. కాగా 2026జనవరి 9 నాటికి ఇది రూ.39.27 లక్షల కోట్లకు చేరింది.


