భారత ప్రభుత్వ ఆహార సబ్సిడీ పథకంలో పారదర్శకతను పెంచేందుకు, అవినీతిని నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) ఆధారిత ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) పైలట్ ప్రాజెక్టును కేంద్ర హోం మంత్రి అమిత్ షా గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ప్రారంభించారు. దీనితో పాటు 24x7 సేవలందించే ‘అన్నపూర్తి’ గ్రెయిన్ ఏటీఎంను కూడా ఆయన ఆవిష్కరించారు.
ఈ-రూపీ ఆధారిత రేషన్ పంపిణీ ఎలా పనిచేస్తుంది?
ప్రస్తుతానికి గుజరాత్‌లోని అహ్మదాబాద్, సూరత్, ఆనంద్, వల్సాద్ జిల్లాల్లో ఈ పైలట్ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. దీని ప్రత్యేకతలు..
లబ్ధిదారుల డిజిటల్ వాలెట్లలో ఆర్‌బీఐ (ఆర్‌బీఐ) ద్వారా ‘ఈ-రూపీ’ క్రెడిట్ అవుతుంది. ఇందులో సరకు రకం, పరిమాణం, రాయితీ ధర ముందే పరిగణలోకి తీసుకుంటారు. ఈ డిజిటల్ టోకెన్లను కేవలం అధీకృత రేషన్ షాపుల్లో తమకు కేటాయించిన సరుకుల కోసం మాత్రమే వాడాలి. ఇతర అవసరాలకు వీటిని ఖర్చు చేయడం సాధ్యపడదు. స్మార్ట్‌ఫోన్ ఉన్నవారు క్యూఆర్ కోడ్ ద్వారా, సాధారణ ఫీచర్ ఫోన్లు ఉన్నవారు ఆధార్ ఆధారిత ఓటీపీ ద్వారా ఈ లావాదేవీలను పూర్తి చేయవచ్చు.
సాధారణంగా పాత పద్ధతిలో డీలర్లకు ప్రభుత్వం నుంచి డబ్బులు రావడానికి సమయం పట్టేది. కానీ ఈ-రూపీ విధానంలో లబ్ధిదారుడు వౌచర్‌ను రిడీమ్ చేయగానే ఆ టోకెన్ విలువకు సమానమైన నగదు డీలర్ బ్యాంక్ ఖాతాలో తక్షణమే జమ అవుతుంది. ప్రతి కిలో ధాన్యం ఎవరికి అందింది, ఏ సమయంలో అందింది అనే సమాచారం రియల్ టైమ్‌లో ప్రభుత్వానికి అందుతుంది. దీనివల్ల మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. తూకంలో మోసాలకు తావుండదు.
‘అన్నపూర్తి’ గ్రెయిన్ ఏటీఎం
సామాన్యులకు రేషన్ సేకరణను మరింత సులభతరం చేస్తూ ‘అన్నపూర్తి’ పేరుతో ఆటోమేటెడ్ గ్రెయిన్ డిస్పెన్సింగ్ మెషీన్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈ ఏటీఎంలు రోజులో 24 గంటలు పనిచేస్తాయి. కేవలం 35 సెకన్లలో 25 కిలోల ధాన్యాన్ని పంపిణీ చేయగలవు. మార్చి 2026 నాటికి ఈ యంత్రాల ద్వారా గోధుమలు, బియ్యంతో పాటు (25 కిలోల వరకు), ఒక కిలో ప్యాకెట్లలో కందిపప్పు, శనగలు, చక్కెర, ఉప్పును లబ్ధిదారులు పొందవచ్చు. ఈ ఏటీఎం యంత్రాలను పూర్తిగా గుజరాత్‌లోనే తయారు చేయడం విశేషం.
ఈ ఏటీఎంలను ఉపయోగించడానికి ‘స్మార్ట్ రేషన్ కార్డ్’ లేదా ప్రభుత్వం జారీ చేసిన ప్రత్యేక డిజిటల్ కార్డ్ అవసరం ఉంటుంది. లబ్ధిదారుడు తన రేషన్ కార్డును ఏటీఎం మిషీన్ వద్ద ఉన్న రీడర్ ద్వారా స్కాన్ చేయాలి. కార్డుతో పాటు భద్రత కోసం వేలిముద్ర లేదా కంటిపాప(ఐరిస్) స్కాన్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల కార్డు వేరే వారు దొంగిలించినా ధాన్యం తీసుకోలేరు. కొన్ని సందర్భాల్లో కార్డు లేకపోయినా ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ ద్వారా కూడా లావాదేవీ పూర్తి చేయవచ్చు.
ఏటీఎం పనిచేసే విధానం
పైన చెప్పినట్లుగా కార్డ్ లేదా బయోమెట్రిక్ ద్వారా లబ్ధిదారుడిని మిషీన్ గుర్తిస్తుంది. ఆ నెలలో వారికి ఎంత కోటా మిగిలి ఉందో స్క్రీన్ మీద కనిపిస్తుంది. స్క్రీన్ మీద మీకు కావాల్సిన వస్తువును (ఉదాహరణకు: బియ్యం లేదా గోధుమలు) పరిమాణాన్ని ఎంచుకోవాలి. ఈ మిషీన్లలో సెన్సార్లు ఉంటాయి. ఇవి ధాన్యాన్ని గ్రాములతో సహా అత్యంత కచ్చితంగా తూకం వేస్తాయి. మాన్యువల్ తూకంలో జరిగే మోసాలకు ఇక్కడ తావుండదు. మీరు ఎంచుకున్న వస్తువు కింద ఉన్న అవుట్‌లెట్ ద్వారా బయటకు వస్తుంది. పప్పులు, ఉప్పు వంటివి అయితే సీల్డ్ ప్యాకెట్ల రూపంలో వస్తాయి.
దేశవ్యాప్త విస్తరణ ప్రణాళిక
ఈ పైలట్ ప్రాజెక్ట్ గుజరాత్‌లో విజయవంతమైన తర్వాత ఈ పైలట్ ప్రాజెక్టును చండీగఢ్, పుదుచ్చేరి, దాద్రా నగర్ హవేలీ వంటి కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించనున్నారు. రాబోయే మూడు, నాలుగేళ్లలో ఈ సీబీడీసీ ఆధారిత రేషన్ వ్యవస్థను దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల సామాజిక సంక్షేమ పథకాల్లో ‘ప్రోగ్రామబుల్ డిజిటల్ కరెన్సీ’ని ఉపయోగిస్తున్న ప్రపంచంలోని అగ్రగామి దేశంగా భారత్ నిలవనుంది.
ఇదీ చదవండి: నకిలీ రెజ్యూమెతో కంపెనీకి కుచ్చుటోపీ


