వ్యవసాయ రంగంలో పెట్టుబడులకు ఊతం
పరిశ్రమవర్గాల అంచనా
భారత్, న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో ఎగుమతుల మార్కెట్లపరంగా వైవిధ్యం పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే వ్యవసాయం తదితర రంగాల్లో పెట్టుబడులు పెరిగేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నాయి. ఎఫ్‌టీఏపై డిసెంబర్ 22న చర్చలు ముగియగా, వచ్చే ఏడాదిలో ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉంది.
దీని ప్రకారం భారత్‌లోకి న్యూజిలాండ్ నుంచి వచ్చే 15 ఏళ్లలో 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రానుండగా, ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం వచ్చే అయిదేళ్లలో 5 బిలియన్ డాలర్లకు పెరగనుంది. ఈ ఒప్పందంతో రెడీమేడ్ దుస్తులు, ఫ్యాషన్ దుస్తులు మొదలైన వాటి ఎగుమతులు పెరిగేందుకు మరింతగా ఊతం లభిస్తుందని అపారెల్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ సెక్రటరీ జనరల్ మిథిలేశ్వర్ ఠాకూర్ తెలిపారు.
భారత్ నుంచి అన్ని ఎగుమతులపై టారిఫ్‌లను తొలగించడం వల్ల న్యూజిలాండ్ మార్కెట్లో మిగతా ఉత్పత్తులతో దీటుగా మన ఉత్పత్తులు పోటీపడేందుకు వీలవుతుందని ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్‌ఐఈవో ప్రెసిడెంట్ ఎస్‌సీ రాల్హన్ తెలిపారు. ఇక వ్యవసాయం, డెయిరీ, మౌలిక సదుపాయాల రంగాల్లో న్యూజిలాండ్ 20 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుండటం దేశీయంగా సాగు రంగం ఉత్పాదకత పెరగడానికి తోడ్పడుతుందని అంతర్జాతీయ వాణిజ్య నిపుణులు, హై–టెక్ గేర్స్ చైర్మన్ దీప్ కపూరియా చెప్పారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక బంధాలు పూర్తి స్థాయిలో బలోపేతం కావడానికి ఎఫ్‌టీఏ దోహదపడుతుందని జీటీఆర్‌ఐ పేర్కొంది.
ఇదీ చదవండి: జీమెయిల్ ఐడీని మార్చుకోవచ్చు


