తన గురించి తానే కాస్త అతిగా గొప్పలు చెప్పుకునే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పొగిడేసుకున్నారు. తనను తాను ప్రశంసించుకుంటూ 10 నెలల్లో 8 యుద్ధాలను ఆపేశానని.. ఇందుకు ప్రధాన కారణం టారిఫ్‌లేనంటూ వ్యాఖ్యానించారు. తాజాగా అమెరికా ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇంగ్లీష్ భాషలో తనకు అత్యంత ఇష్టమైన పదం ‘టారిఫ్స్’ అంటూ చెప్పుకొచ్చారు.
మరోవైపు మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌పై విమర్శలు గుప్పించారు. తనకు గందరగోళ పరిస్థితి వదిలి వెళ్లారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాను అమెరికా బలాన్ని తిరిగి నిలబెట్టానని.. 10 నెలల్లో 8 యుద్ధాలను పరిష్కరించానన్నారు. ఇరాన్ అణు ముప్పును తొలగించాను. గాజాలో యుద్ధాన్ని ముగించాను. దాదాపు 3,000 ఏళ్ల అనంతరం అక్కడ శాంతిని నెలకొల్పి.. బందీలను స్వదేశానికి తీసుకొచ్చానన్న ట్రంప్.. తన ప్రభుత్వ 2026 అజెండాను ప్రజలకు వివరించారు.
#WATCH | In an address to the Nation, US President Donald Trump says, "I restored American strength, settled 8 wars in 10 months, destroyed the Iran nuclear threat and ended the war in Gaza - bringing for the first time in 3000 years peace to the Middle East and secured the… pic.twitter.com/8SAKdDQLvN
— ANI (@ANI) December 18, 2025
కాగా, అమెరికాలోకి ప్రవేశించకుండా నిషేదించిన దేశాల జాబితాను ట్రంప్ యంత్రాంగం మరింత విస్తరించింది. మరో 20 దేశాలను తాజాగా అందులోకి చేర్చింది. అమెరికా జాతీయ భద్రత, ప్రజల భద్రత ప్రయోజనాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. సంబంధిత ఉత్తర్వులపై అధ్యక్షుడు మంగళవారం సంతకం చేశారు.
బుర్కినా ఫాసో, మాలీ, నైగర్, దక్షిణ సుడాన్, సిరియాపై పూర్తి ఆంక్షలు, అమెరికాలోకి ప్రవేశంపై నిషేధం విధించారు. మరో 15 దేశాలైన అంగోలా, ఆంటిగ్వా అండ్ బార్బుడా, బెనిన్, కోటె డి ఐవోయిర్, డొమినికా, గాబన్, ద గాంబియా, మలావీ, మార్షియానా, నైజీరియా, సెనెగల్, టాంజానియా, టోంగా, జాంబియా, జింబాబ్వే పాక్షిక నిషేధ పరిధిలోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


