న్యూఢిల్లీ: ఢిల్లీని కమ్మేసిన విషపూరిత పొగమంచు, వాయు కాలుష్యంపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో, చైనా తన విజయగాథను భారత్‌తో పంచుకుంది. ఒకప్పుడు ‘ప్రపంచ స్మోగ్ రాజధాని’గా పేరుగాంచిన బీజింగ్, కేవలం దశాబ్ద కాలంలోనే వాయు కాలుష్యాన్ని ఎలా తరిమికొట్టిదో వివరిస్తూ చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి యు జింగ్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా వరుస పోస్ట్‌లు చేశారు. 2013లో 101.7 ug/m3గా ఉన్న బీజింగ్ వార్షిక PM 2.5 సగటు, 2024 నాటికి ఏకంగా 30.9 ug/m3కు పడిపోవడం గమనార్హం.
బీజింగ్ అనుసరించిన వ్యూహాలివే!
వాయు కాలుష్య నివారణకు వాహన ఉద్గారాల నియంత్రణే మొదటి మెట్టు అని జింగ్ పేర్కొన్నారు. యూరో 6 ప్రమాణాలకు సమానమైన 'చైనా 6NI' నిబంధనలను కఠినంగా అమలు చేయడం, పాత వాహనాలను దశలవారీగా తొలగించడం ద్వారా బీజింగ్ గణనీయమైన మార్పు సాధించింది. కేవలం నిబంధనలే కాకుండా, లైసెన్స్ ప్లేట్ లాటరీలు, బేసి-సరి వంటి కఠినమైన ట్రాఫిక్ నియమాలను అమలు చేస్తూనే.. ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రో, బస్సు నెట్‌వర్క్‌లను నిర్మించింది. విద్యుత్ వాహనాల (ఈవీ) వినియోగాన్ని వేగవంతం చేయడం ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది.
మరోవైపు పారిశ్రామిక పునర్నిర్మాణం ద్వారా బీజింగ్ విప్లవాత్మక మార్పులు చేపట్టింది. సుమారు 3000కు పైగా భారీ పరిశ్రమలను నగరం నుండి తొలగించడం లేదా మూసివేయడం జరిగింది. ముఖ్యంగా చైనాలోనే అతిపెద్ద ఉక్కు తయారీ సంస్థ ‘షోగాంగ్’ను వేరే ప్రాంతానికి తరలించడం ద్వారా గాలిలోని హానికారక కణాలు ఒక్కసారిగా 20 శాతం తగ్గాయి. ఖాళీ అయిన కర్మాగారాల స్థలాలను పార్కులుగా, సాంస్కృతిక కేంద్రాలుగా మార్చగా, మాజీ షోగాంగ్ సైట్ 2022 వింటర్ ఒలింపిక్స్‌కు వేదిక కావడం విశేషం.
అయితే భారత్‌లో కూడా ఇటువంటి ప్రణాళికలు చర్చల్లో ఉన్నప్పటికీ, వాటి అమలు తీరులోనే ప్రధాన తేడా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘మన వద్ద BS6 ప్రమాణాలు ఉన్నా, రాజకీయ సంకల్పం లేకపోవడం వల్ల ఆశించిన ఫలితాలు రావడం లేదు’ అని పర్యావరణ విశ్లేషకులు సునీల్ దహియా పేర్కొన్నారు. కేవలం కాలుష్యం పెరిగినప్పుడు మాత్రమే అత్యవసర చర్యలు తీసుకోవడం కాకుండా, బీజింగ్ మాదిరిగా ఏడాది పొడవునా కఠినమైన పారిశ్రామిక మార్పులు అమలు చేయాలి. ఇంధన పరివర్తన చేపట్టినప్పుడే ఢిల్లీలో స్వచ్ఛమైన గాలి సాధ్యమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: శిల్పకళా భీష్మాచార్యుడు రామ్ సుతార్ కన్నుమూత


