హిమాలయాల నుంచి భారత్, బంగ్లాదేశ్‌లలోకి ప్రవహిస్తూ, కోట్లాది మందికి జీవనాధారమైన బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న భారీ జలవిద్యుత్ ప్రాజెక్టు అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. టిబెట్‌లోని యార్లంగ్ త్సాంగ్పో (బ్రహ్మపుత్ర) నదిపై సుమారు $168 బిలియన్ల(సుమారు రూ. 1,51,860 కోట్లు) వ్యయంతో బీజింగ్ ఈ మౌలిక సదుపాయాల ప్రాజెక్టును చేపట్టింది. ఇది పర్యావరణానికే కాకుండా, భారత్ వంటి దేశాల వ్యూహాత్మక ప్రయోజనాలను కూడా దెబ్బతీయనుంది.
పర్యావరణ సమతుల్యతకు విఘాతం
ఈ ప్రాజెక్టులో భాగంగా నది సహజ ప్రవాహాన్ని మళ్లించేలా డ్యామ్‌లు, రిజర్వాయర్లు, భూగర్భ విద్యుత్ కేంద్రాలను నిర్మిస్తున్నారు. జలవిద్యుత్ ఉత్పత్తి కోసం నది ఎత్తులో ఉండే 2,000 మీటర్ల మార్పును చైనా వాడుకోనుంది. అయితే ఈ జోక్యం వల్ల నది సహజ ప్రవాహం దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల చేపల వలసలు, అవక్షేపాల కదలికలు మారిపోయి, దిగువ ప్రాంతాల్లో వ్యవసాయం , జీవవైవిధ్యంపై కోలుకోలేని దెబ్బ పడే ప్రమాదం ఉంది.
‘వాటర్ బాంబ్’ కానుందా?
చైనా చర్యలను అరుణాచల్ ప్రదేశ్ తదితర సరిహద్దు రాష్ట్రాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. చైనా ఎప్పుడు నీటిని విడుదల చేస్తుందో, ఎప్పుడు నిలిపివేస్తుందో తెలియని అనిశ్చితి నెలకొంది. అత్యవసర సమయాల్లో భారీగా నీటిని వదిలితే కృత్రిమ వరదలు, నిలిపివేస్తే కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్టును భారత్‌పై ప్రయోగించే ఒక ‘వాటర్ బాంబ్’గా ఆ రాష్ట్ర ఉన్నతాధికారులు అభివర్ణించడం గమనార్హం.
భౌగోళిక రాజకీయ వ్యూహాలు
పర్యావరణ కోణంలోనే కాకుండా, ఈ ప్రాజెక్టు వెనుక చైనా రాజకీయ వ్యూహం దాగి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. హిమాలయ ప్రాంతాల్లో సరిహద్దు వెంబడి మౌలిక సదుపాయాలను పెంచుకోవడం ద్వారా టిబెట్, భారత్ సరిహద్దులపై పూర్తి నియంత్రణ సాధించాలని బీజింగ్ యోచిస్తోంది. మెకాంగ్ నది విషయంలో కూడా చైనా ఇలాగే వ్యవహరించి.. వియత్నాం వంటి దేశాల్లో కరువుకు కారణమైందనే ఆరోపణలు ఉన్నాయి.
చెదిరిపోతున్న స్థానిక జీవనం
ఈ మెగా ప్రాజెక్టు కారణంగా టిబెట్‌లోని మోన్పా, లోబా వంటి స్థానిక తెగలకు చెందిన వేలాదిమంది ప్రజలు తమ పూర్వీకుల గృహాలను వదులుకోవాల్సి వస్తోంది. బలవంతపు తరలింపుల వల్ల స్థానిక సంస్కృతి, ఉపాధి వనరులు నాశనమవుతాయని మానవ హక్కుల సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. స్థానికుల స్థానంలో ఇతర ప్రాంతాల వలస కార్మికులను తీసుకురావడం ద్వారా ఆ ప్రాంత జనాభా స్వరూపాన్ని మార్చేందుకు చైనా ప్రయత్నిస్తోందని టిబెట్ పాలసీ ఇన్‌స్టిట్యూట్ విమర్శించింది.
భారత్ ముందస్తు చర్యలు
చైనా కదలికలను నిశితంగా గమనిస్తున్న భారత ప్రభుత్వం, సరిహద్దు ప్రాంతాల పౌరుల ప్రయోజనాలను కాపాడేందుకు సిద్ధమవుతోంది. చైనా డ్యామ్‌కు ప్రతిగా బ్రహ్మపుత్రపై సుమారు 11,200 మెగావాట్ల సామర్థ్యం గల భారీ డ్యామ్‌ను నిర్మించాలని భారత్ ప్రతిపాదించింది. అయితే ఇరు దేశాల మధ్య ఈ ‘డ్యామ్ నిర్మాణ రేసు’ పర్యావరణానికి మరింత ముప్పు తెస్తుందని, రెండు దేశాలు కలిసి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తప్పవని అంతర్జాతీయ నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ‘సెవెన్ సిస్టర్స్’పై దారుణ వ్యాఖ్యలు.. ‘బంగ్లా’పై భారత్ సీరియస్


