ముంబై: అంధుల మహిళల టి20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టును క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అభినందించాడు. తొలిసారి నిర్వహించిన ఈ మెగాటోర్నీలో భారత జట్టు అజేయంగా ట్రోఫీ చేజిక్కించుకుంది. తాజాగా వరల్డ్‌కప్ నెగ్గిన భారత జట్టు... మంగళవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో సచిన్‌ను కలిసింది. ఈ సందర్భంగా ప్రపంచకప్‌లో మన అమ్మాయిలు చూపిన ప్రతిభాపాటవాలను మాస్టర్ బ్లాస్టర్ కొనియాడాడని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు.
‘కఠోర శ్రమ, అకుంఠిత దీక్షతోనే మన జట్టు ప్రపంచకప్ గెలిచింది. ఇది ఆరంభం మాత్రమే. మున్ముందు కూడా ఇదే నిలకడ కొనసాగిస్తూ... మరిన్ని విజయాలు సాధించాలి. ఈ విజయం అందరి బాధ్యతను మరింత పెంచింది. ప్రపంచ కప్ ట్రోఫీ ఎంతో మందిలో స్ఫూర్తి నింపింది’ అని సచిన్ పేర్కొన్నాడని నిర్వాహకులు తెలిపారు.
వరల్డ్‌కప్ గెలిచిన భారత జట్టు కెపె్టన్ దీపిక మాట్లాడుతూ... ‘సచిన్ మాటలు మాకు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి. మేము మైదానంలోకి దిగిన ప్రతిసారీ ఎంతో అంకితభావం, ఆత్మవిశ్వాసంతో ఆడాం. దానికి తగ్గ ప్రతిఫలం వరల్డ్ కప్ రూపంలో దక్కింది. సచిన్ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వినడంతో మా మనసు ఉప్పొంగుతోంది’ అని దీపిక పేర్కొంది.


