టీమిండియా- సౌతాఫ్రికా మధ్య టీ20 సిరీస్ విజేత తదుపరి మ్యాచ్‌లో తేలనుంది. లక్నో వేదికగా బుధవారం జరగాల్సిన నాలుగో టీ20 టాస్ పడకుండానే రద్దై పోయింది. అయితే, ఎప్పటిలా వర్షం వల్ల కాకుండా.. ఈసారి పొగమంచు కారణంగా మ్యాచ్ మొదలుకాకుండానే ముగిసిపోయింది.
స్టేడియాన్ని పొగమంచు కమ్మేయడంతో వరుస విరామాల్లో మైదానానికి వచ్చిన అంపైర్లు.. పరిస్థితిని పర్యవేక్షించారు. భారత కాలమానం ప్రకారం.. బుధవారం 6.30 నిమిషాలకు టాస్ పడాల్సి ఉండగా.. ఈ కారణం వల్లే తొలుత ఆలస్యమైంది. ఈ క్రమంలో వరుస విరామాల్లో అంపైర్లు వచ్చి సమీక్ష నిర్వహించారు. మైదానమంతా కలియదిరుగుతూ బ్యాటర్, బౌలర్, ఫీల్డర్ల స్థానాల నుంచి బంతి స్పష్టంగా కనబడుతుందా? లేదా? అని పరిశీలించారు.
పదే.. పదే
ఇందులో భాగంగా 6.50 నిమిషాలకు ఓసారి.. 7.30 నిమిషాలకు మరోసారి.. ఆపై.. 8 గంటలకు.. అనంతరం 8.30 నిమిషాలకు.. మైదానంలోకి వచ్చిన అంపైర్లు పరిస్థితిని సమీక్షించారు. ఈ క్రమంలో పిచ్‌పై కవర్లు కప్పి ఉంచాలని సూచించారు. ఈసారి బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాతోనూ వారు మాట్లాడటం గమనార్హం.
అనంతరం 9 గంటలకు మరోసారి రివ్యూ చేసిన అంపైర్లు.. ప్రేక్షకుల సహనానికి మరోసారి పరీక్ష పెట్టారు. ఈసారి 9.25 నిమిషాలకు మరోసారి రివ్యూ చేస్తామని చెప్పి మైదానం వీడారు. ఈ పరిణామాల నేపథ్యంలో స్టేడియంలోని ప్రేక్షకులు కంగుతిన్నారు. మ్యాచ్ సాగుతుందా? లేదా? అన్న అంశంపై త్వరగా తేల్చకుండా ఇదేం తీరు అనేలా రియాక్షన్స్ ఇచ్చారు.
మరోవైపు.. లక్నోలో పొగమంచు కమ్ముకున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ సాగదని తెలిసినా ఎందుకు సాగదీస్తున్నారంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. ఇక కామెంటేటర్లు కూడా దాదాపుగా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఎట్టకేలకు
ఈ క్రమంలో... 9.25 నిమిషాలకు మరోసారి మైదానంలోకి వచ్చి పరిస్థితి పరిశీలించిన తర్వాత మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో అభిమానులు నిరాశగా వెనుదిరిగారు.
కాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా 2-1తో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. తొలుత కటక్‌లో భారత్ 101 పరుగుల తేడాతో జయభేరి మోగించగా.. ముల్లన్‌పూర్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో సౌతాఫ్రికా 51 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ క్రమంలో సిరీస్ 1-1తో సమం కాగా.. ధర్మశాల వేదికగా మూడో టీ20లో భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది.. 2-1తో ముందంజ వేసింది. ఇరుజట్ల మధ్య బుధవారం లక్నోలోని ఏకనా స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్ టాస్ పడకుండానే ఇలా ముగిసిపోయింది. ఇక సిరీస్ విజేతను తేల్చే శుక్రవారం నాటి మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక.
చదవండి: నాలుగో టీ20 నుంచి గిల్ అవుట్!


