టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టీ20 ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమ రేటింగ్ సాధించిన భారత బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో పేస్ దళ నాయకుడు జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) పేరిట ఉన్న రికార్డును వరుణ్ చక్రవర్తి బద్దలు కొట్టాడు.
అత్యుత్తమంగా 32 వికెట్లు
కాగా 2021 టీ20 ప్రపంచకప్ టోర్నీలో పేలవ ప్రదర్శన తర్వాత వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) టీమిండియాకు దూరమయ్యాడు. అయితే, ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచి రీఎంట్రీ ఇచ్చిన ఈ రైటార్మ్ స్పిన్నర్.. అసాధారణ ప్రతిభతో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికి 19 టీ20 మ్యాచ్‌లలో కలిపి వరుణ్ చక్రవర్తి అత్యుత్తమంగా 32 వికెట్లు కూల్చాడు.
సౌతాఫ్రికాతో స్వదేశంలో తాజా టీ20 సిరీస్‌లోనూ వరుణ్ చక్రవర్తి అదరగొడుతున్నాడు. ఇప్పటికి సఫారీలతో జరిగిన మూడు మ్యాచ్‌లలో రెండేసి వికెట్ల చొప్పున ఆరు వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో ఓవరాల్‌గా 6.75 ఎకానమీతో వికెట్లు తీసిన వరుణ్.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ దుమ్ములేపాడు.
818 రేటింగ్ పాయింట్లు
టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న వరుణ్ చక్రవర్తి.. రేటింగ్‌ను భారీగా మెరుగుపరచుకున్నాడు. కెరీర్‌లోనే అత్యుత్తమంగా ఏకంగా 818 రేటింగ్ పాయింట్లు సాధించి.. రెండో ర్యాంకర్ జేకబ్ డఫీ (699 పాయింట్లు)కి అందనంత దూరంలో నిలిచాడు.
అదే విధంగా.. అంతర్జాతీయ టీ20లలో అత్యుత్తమ రేటింగ్ సాధించిన భారత బౌలర్‌గానూ వరుణ్ చక్రవర్తి నిలిచాడు. అంతకుముందు.. 2017లో బుమ్రా కెరీర్ బెస్ట్ 783 రేటింగ్ పాయింట్లతో ఈ ఘనత సాధించగా.. వరుణ్ ఇప్పుడు దానిని అధిగమించాడు.
అంతేకాదు.. అత్యుత్తమ టీ20 రేటింగ్ పాయింట్లు కలిగి ఉన్న టాప్-10 ఓవరాల్ బౌలర్ల జాబితాలోనూ చోటు సంపాదించాడు. కాగా ఈ ఏడాది సెప్టెంబరులో వరుణ్ తొలిసారి టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం పొందిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ టాప్ ర్యాంకు నిలబెట్టుకోగా.. తిలక్ వర్మ రెండు స్థానాలు ఎగబాకి.. నాలుగో ర్యాంకులో నిలిచాడు.
పురుషుల అంతర్జాతీయ టీ20లలో బెస్ట్ బౌలర్ రేటింగ్స్
👉ఉమర్ గుల్ (పాకిస్తాన్)- 865
👉శామ్యూల్ బద్రీ (వెస్టిండీస్-) 864
👉డేనియల్ వెటోరి (న్యూజిలాండ్)- 858
👉సునీల్ నరైన్ (వెస్టిండీస్)- 832
👉రషీద్ ఖాన్ (అఫ్గనిస్తాన్)- 828
👉తబ్రేజ్ షంసీ (దక్షిణాఫ్రికా)- 827
👉షాహిద్ అఫ్రిది (పాకిస్థాన్)- 822
👉వరుణ్ చక్రవర్తి (ఇండియా)- 818
👉షాదాబ్ ఖాన్ (పాకిస్తాన్)- 811
👉వనిందు హసరంగా (శ్రీలంక)- 809.
చదవండి: IPL 2026: కనక వర్షం.. ‘మినీ’ వేలంలో ఎవరికి ఎంత? పది జట్ల వివరాలు


