కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్ (PC: CSK X)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2026 వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) తీసుకున్న నిర్ణయాలు సంచలనాత్మకంగా మారాయి. క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా గుర్తింపు పొందిన చెన్నై ఈసారి మినీ వేలంలో ఓ రకంగా ప్రకంపనలు సృష్టించింది. సాధారణంగా అనుభవానికి పెద్దపీట వేసే సీఎస్‌కే ... ఈసారి మాత్రం భవిష్యత్తుపై భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టింది.
ఐపీఎల్ చరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా... అన్‌క్యాప్డ్ ఆటగాళ్ల కోసం చెన్నై ఫ్రాంచైజీ కోట్ల రూపాయలను మంచి నీళ్ల ప్రాయంలా ఖర్చు పెట్టింది. ఒకప్పుడు ‘డాడీస్ ఆర్మీ’గా ముద్రపడ్డ చెన్నై సూపర్ కింగ్స్... ఐపీఎల్ వేలంలో ప్రశాంత్ వీర్ (Prashant Veer), కార్తీక్ శర్మను రూ. 14.20 కోట్ల చొప్పున వెచ్చించి కొనుగోలు చేసుకుంది.
రంజీ ట్రోఫీ, ముస్తాక్ అలీ టోర్నీ, భారత్ ‘ఎ’, అండర్–19, అండర్–23 ఇలా ఏ స్థాయిలోనూ పెద్దగా ఆకట్టుకోకపోయినా... కేవలం నైపుణ్యాన్ని నమ్మి యువ ఆటగాళ్ల కోసం భారీగా వెచ్చిచండం విశేషం. ప్రతిభకు పెద్ద పీట వేసే చెన్నై జట్టు ఇంత భారీ ఖర్చు పెట్టడంతో... కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్‌ల గురించి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా వీరిద్దరి నేపథ్యాలను పరిశీలిస్తే...
ధోనీకి ప్రత్యామ్నాయమా!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆరంభం నుంచి... ఏవో కొన్ని మ్యాచ్‌లు తప్ప... దాదాపు అన్నీ సమయాల్లో మహేంద్ర సింగ్ ధోనినే చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) వికెట్ కీపర్‌గా దర్శనమిచ్చాడు. అయితే గత కొన్నాళ్లుగా బ్యాటింగ్ ఆర్డర్‌లో ఆఖర్లో వస్తున్న ధోని... ఇంకెంతో కాలం ఐపీఎల్‌లో కొనసాగే అవకాశాలు కనిపించడం లేదు.
దీంతో వికెట్ల వెనక సమర్థవంతంగా విధులు నిర్వర్తించడంతో పాటు... లోయర్ ఆర్డర్‌లో ధాటిగా షాట్‌లు ఆడగల ప్లేయర్‌ను ఎంపిక చేసుకోవాలనే ఉద్దేశంతో చెన్నై ఫ్రాంచైజీ వేలంలో అడుగు పెట్టింది.
అంతకుముందే టీమిండియా ప్లేయర్ సంజూ శాంసన్(Sanju Samson)ను ట్రేడింగ్‌లో తీసుకున్నా... భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని యువకులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో రాజస్తాన్‌కు చెందిన 19 ఏళ్ల కార్తీక్ శర్మ కోసం కోట్లు కుమ్మరించింది.
జడేజా స్థానాన్ని భర్తీ చేసేందుకు...
ఐపీఎల్ వేలానికి ముందే ట్రేడింగ్‌లో రవీంద్ర జడేజాను వదిలేసుకున్న చెన్నై జట్టు అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు ఉత్తర ప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల ప్రశాంత్ వీర్‌ను ఎంపిక చేసుకుంది. ఎడంచేతి వాటం స్పిన్నర్ అయిన ప్రశాంత్... లోయర్ ఆర్డర్‌లో ధాటిగా ఆడగల సమర్థుడు.
ఉత్తర ప్రదేశ్ లీగ్‌లో మంచి ప్రదర్శనలు కనబర్చిన ప్రశాంత్... ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 2 మ్యాచ్‌లాడి 2 వికెట్లు తీశాడు. ఇక టి20ల్లో 9 మ్యాచ్‌లాడి 160కి పైగా స్ట్రయిక్ రేట్‌తో 112 పరుగులు చేయడంతో పాటు 12 వికెట్లు పడగొట్టాడు. ప్రాధమిక ధర రూ. 30 లక్షలతో వేలంలో అడుగపెట్టిన ప్రశాంత్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ రూ. 14.20 కోట్లు ఖర్చు చేసింది.
చదవండి: IPL 2026: కనక వర్షం.. ‘మినీ’ వేలంలో ఎవరికి ఎంత? పది జట్ల వివరాలు


