ఐపీఎల్-2026 మినీ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను రూ. 25.20 కోట్ల భారీ ధరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా రికార్డు సృష్టించిన గ్రీన్.. వేలం ముగిసిన కొన్ని గంటల వ్యవధిలోనే తన పేలవ ప్రదర్శనతో అందరిని నిరాశపరిచాడు.
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో ప్రారంభమైన మూడో టెస్టులో గ్రీన్ డకౌటయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన గ్రీన్ తన పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. 2 బంతులు ఎదుర్కొని జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో బ్రైడన్ కార్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
దీంతో నెటిజన్లు గ్రీన్‌పై సెటైర్లు వేస్తున్నారు. ఐపీఎల్‌లో కూడా ఇలానే ఆడుతావా? కేకేఆర్ భయపడుతోంది అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. గాయం కారణంగా గత ఐపీఎల్ సీజన్‌కు దూరంగా ఉన్న గ్రీన్.. ఈసారి కేకేఆర్ తరపున బరిలోకి దిగనున్నాడు.
గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్‌కు ఆడాడు. దాదాపు ఆరు నెలల తర్వాత పోటీ క్రికెట్‌లో తిరిగొచ్చిన గ్రీన్.. టెస్టుల్లో మాత్రం రాణించలేకపోతున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం పర్వాలేదన్పిస్తున్నాడు. అయితే కామెరూన్ తనదైన రోజున ఒంటి చేత్తో జట్టును గెలిపించగలడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది.
ఆసీస్ బ్యాటర్లలో అలెక్స్ క్యారీ(106) సూపర్ సెంచరీతో చెలరేగగా.. ఉస్మాన్ ఖవాజా(126 బంతుల్లో 82), ఇంగ్లిష్(32) రాణించారు. ప్రస్తుతం క్రీజులో మిచెల్ స్టార్క్(33), లియోన్(0) ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లు పడగొట్టగా.. విల్ జాక్స్, బ్రైడన్ కార్స్ తలా రెండు వికెట్లు సాధించారు.
చదవండి: 'డేల్ స్టెయిన్ ఆఫ్ బారాముల్లా'.. ఢిల్లీ జట్టులోకి పేస్ సంచలనం


