ఐపీఎల్-2026 మినీ వేలంలో ఓ 20 ఏళ్ల యువ ఆటగాడిపై కాసుల వర్షం కురిసింది. అతడి కోసం చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ వంటి దిగ్గజ ఫ్రాంచైజీల సైతం పోటీ పడ్డాయి. రూ. 30ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఆ యువ ఆల్‌రౌండర్.. నిమిషాల వ్యవధిలోనే కోటీశ్వరుడిగా మారిపోయాడు.
రికార్డు ధర దక్కించుకుని అందరిని ఆశ్చర్యపరిచాడు. అతడే ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ప్రశాంత్ వీర్. దుబాయ్ వేదికగా జరుగుతున్న మినీ వేలంలో ప్రశాంత్ వీర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఏకంగా రూ. 14.20 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఎస్‌ఆర్‌హెచ్‌తో పోటీ పడి మరి అతడిని సీఎస్‌కే సొంతం చేసుకుంది.
తొలి బిడ్ నుంచి పోటీలో ఉన్న సీఎస్‌కే ఆఖరి వరకు వెనక్కి తగ్గలేదు. రచిన్ రవీంద్ర, లైమ్ లివింగ్‌స్టోన్ వంటి విధ్వంసకర ఆల్‌రౌండర్లను కాదని మరి ఈ యువ ఆటగాడిని సీఎస్‌కే దక్కించుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ప్రశాంత్ రికార్డు నెలకొల్పాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా పేసర్ అవేష్ ఖాన్(రూ. 10 కోట్లు) పేరిట ఉండేది. తాజా వేలంతో అవేష్ రికార్డును ప్రశాంత్ బ్రేక్ చేశాడు. దీంతో ఎవరీ ప్రశాంత్ వీర్ నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.
ఎవరీ ప్రశాంత్ వీర్..?
యూపీలోని అమేథీకి చెందిన ప్రశాంత్ వీర్.. అద్భుతమైన బ్యాటింగ్ ఆల్‌రౌండర్. 20 ఏళ్ల ప్రశాంత్‌కు బ్యాట్‌తో పాటు బంతితో కూడా రాణించే సత్తా ఉంది. మిడిలార్డర్‌లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడడం అతడి స్పెషాలిటీ. అతడు లెఫ్మ్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు. యూపీ టీ20 లీగ్-2025లో నోయిడా సూపర్ కింగ్స్ తరపున ఆడిన ప్రశాంత్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు.
ఈ టోర్నీలో 10 మ్యాచ్‌లు ఆడిన వీర్.. 320 పరుగులతో పాటు ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. ఈ టీ20 లీగ్‌లో అతడి బ్యాటింగ్ స్ట్రైక్ రేటు 169.69 ఉంది. ఈ ప్రదర్శనలతో అతడు సీఎస్‌కే స్కౌట్ల దృష్టిలో పడ్డాడు. దీంతో అతడిని వేలానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ ట్రయల్స్‌కు పిలిచింది.
ట్రయల్స్‌లో కూడా ప్రశాంత్ అద్భుతంగా రాణించాడు. రవీంద్ర జడేజాకు దీర్ఘకాలిక ప్రత్యామ్నాయంగా ఈ యువ ఆటగాడిని జట్టులోకి తీసుకోవాలని సీఎస్‌కే అప్పుడే ఫిక్స్ అయ్యింది. ఈ క్రమంలోనే ప్రశాంత్ కోసం సీఎస్‌కే భారీ ధర వెచ్చించింది. అయితే అంత భారీ ధర కేటాయిస్తుందని ఎవరూ ఊహించలేదు.
ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా అతడు దుమ్ములేపాడు. ఈ దేశవాళీ టీ20 టోర్నీలో 112 పరుగుల (స్ట్రైక్ రేట్ 170)తో పాటు 9 వికెట్లు పడగొట్టాడు. ఓ మ్యాచ్‌లో కేవలం 10 బంతుల్లోనే 37 పరుగులు చేసి ఔరా అన్పించాడు. కాగా ప్రశాంత్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.
🚨 Prashant Veer🚨
A 20 year-old all-rounder from UP left-handed batter and economical left-arm spinner. He impressed in UPT20 with 320 runs and 8 wickets in 10 matches (SR 155.34). A flexible middle-overs option with both bat and ball.Let’s see which team shows interest in him pic.twitter.com/Ei1cdvOZ85— Neeraj (@NeerajY00859341) December 15, 2025
చదవండి: IPL 2026 Auction: సీఎస్‌కే వదిలేసింది.. కట్ చేస్తే! వేలంలో కోట్ల వర్షం


