మలేషియాతో మ్యాచ్‌లో భారత అండర్-19 స్టార్ వైభవ్ సూర్యవంశీ ధనాధన్ దంచికొట్టాడు. విధ్వంసకర ఇన్నింగ్స్‌తో బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం పాతిక బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్నాడు. ఏసీసీ మెన్స్ అండర్-19 ఆసియా కప్-2025 టోర్నీలో భాగంగా.. మంగళవారం మలేషియాతో మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది.
దుబాయ్ వేదికగా ఈ యూత్ వన్డేలో భారత ఓపెనర్, కెప్టెన్ ఆయుశ్ మాత్రే (7 బంతుల్లో 14) నిరాశపరచగా.. వైభవ్ (Vaibhav Suryavanshi)మాత్రం తనదైన శైలిలో మెరుపులు మెరిపించాడు. 25 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న ఈ లెఫ్టాండర్ ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి.
దంచికొట్టిన వైభవ్ సూర్యవంశీ.. కానీ
అయితే, హాఫ్ సెంచరీ పూర్తైన వెంటనే వైభవ్ సూర్యవంశీ అవుట్ కావడం అభిమానులను నిరాశపరిచింది. మలేషియా బౌలర్ ముహమ్మద్ అక్రమ్ బౌలింగ్‌లో ముహమ్మద్ ఎన్ ఉర్హానిఫ్‌నకు క్యాచ్ ఇవ్వడంతో అతడి ఇన్నింగ్స్‌కు తెరపడింది. కాగా ఆయుశ్‌తో కలిసి వైభవ్ తొలి వికెట్‌కు 9 బంతుల్లో 21... రెండో వికెట్‌కు విహాన్ మల్హోత్రా (Vihaan Malhotra)తో కలిసి 26.. వేదాంత్‌తో కలిసి మూడో వికెట్‌కు 40 పరుగులు జోడించాడు.
అర్ధ శతకాలు పూర్తి
ఇదిలా ఉంటే.. మలేషియాతో మ్యాచ్‌లో వన్‌డౌన్లో వచ్చిన విహాన్ మల్హోత్రా (7) విఫలం కాగా.. మిగిలిన వారిలో వేదాంత్ త్రివేది (90) తృటిలో సెంచరీ చేజార్చున్నాడు. అభిజ్ఞాన్ కుందు ఏకంగా అజేయ డబుల్ సెంచరీ (125 బంతుల్లో 209)తో దుమ్ములేపాడు. ఫలితంగా 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి ఏకంగా 408 పరుగులు సాధించింది యువ భారత్.
కాగా గ్రూప్-ఎలో భాగంగా భారత్ తమ తొలి మ్యాచ్‌లో యూఏఈని 234 పరుగుల తేడాతో మట్టికరిపించింది. అనంతరం దాయాది పాకిస్తాన్‌పై 90 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఈ క్రమంలో సెమీ ఫైనల్‌కు అర్హత సాధించిన భారత్.. మంగళవారం నామమాత్రపు మ్యాచ్‌లో మలేషియాను ఓడించి అజేయంగా నిలవాలని పట్టుదలగా ఉంది. ఇదిలా ఉంటే.. యూఏఈపై శతక్కొట్టిన వైభవ్.. పాక్‌తో మ్యాచ్ (5)లో మాత్రం విఫలమయ్యాడు.
చదవండి: సర్ఫరాజ్‌కు జాక్‌పాట్!.. మాక్ వేలంలో అమ్ముడు పోయిన ప్లేయర్లు వీరే


