న్యూఢిల్లీ: స్వదేశంలో ఇటీవల జరిగిన సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీలో మహిళల డబుల్స్ టైటిల్‌ను నిలబెట్టుకున్న పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ ఎట్టకేలకు ఈ సీజన్‌ను సంతృప్తికరంగా మలచుకుంది. రెండుసార్లు ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సెమీఫైనలిస్టుగా నిలిచిన ఈ హైదరాబాద్ జోడీకి ఈ సీజన్ ఆరంభం నుంచి కలిసిరాలేదు.
ఈ ఏడాది ఆల్ ఇంగ్లండ్ ఈవెంట్‌లో క్వార్టర్స్‌లోనే వెనుదిరిగిన గాయత్రి–ట్రెసా ద్వయం స్విస్ ఓపెన్‌లో సెమీస్‌లోనే ఆగిపోయింది. తర్వాత జూన్‌లో గాయత్రి భుజం గాయంతో ఈ జోడీ మకావు ఓపెన్ నుంచి నిష్క్రమించి, ఇంటికే పరిమితమైంది.
ఎట్టకేలకు తాజా లక్నో ఈవెంట్‌లో లభించిన టైటిల్ వీళ్లిద్దరి ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. దీనిపై గాయత్రి మాట్లాడుతూ ఓపిక, పట్టుదల, అంకితభావానికి లభించిన టైటిల్‌గా అభివర్ణించింది. పలు అంశాలపై గాయత్రి, ట్రెసా జాలీ అభిప్రాయాలు వారి మాటల్లోనే...
నాన్న తోడుగా నిలువగా...
ఈ ఏడాది భుజం గాయం చాలా ఇబ్బంది పెట్టింది. సీజన్‌లో సుదీర్ఘకాలం ఆటకు దూరం చేసింది. రెండు నెలలకు పైగా విరామం తర్వాత మళ్లీ ఆడటం ప్రారంభించాను. ఇలాంటి సమయంలో సయ్యద్ మోడీ టైటిల్ నా ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచింది. నా ఆట సరైన దిశలో సాగుతోందనిపించేలా చేసింది.
నా ప్రదర్శన, ఫామ్‌పై నమ్మకాన్ని రెట్టింపు చేసింది. కుటుంబం ఇచ్చిన ప్రోత్సాహం వల్లే ఇదంతా సాధ్యమైంది. ముఖ్యంగా నాన్న పుల్లెల గోపీచంద్ ఎంతో శ్రద్ధ పెట్టాడు. నా ఆత్మవిశ్వాసం సన్నగిల్లకుండా ఎప్పటికప్పుడు తోడుగా నిలిచాడు.
కోటి ఆశలతో కొత్త సీజన్‌కు...
మా జోడీకి ఈ సీజన్ గడ్డుగా గడిచింది. కానీ ఒక్క టైటిల్ సాఫల్యం మమ్మల్ని నిలబడేలా చేసింది. కొత్త ఆశలతో వచ్చే సీజన్‌ను ప్రారంభించేందుకు దోహదం చేసింది. ఈ ఏడాది మేం 13 వారాలపాటు (మూడు నెలలకు పైగానే) తొమ్మిదో ర్యాంక్‌తో టాప్–10లో కొనసాగాం. వచ్చే ఏడాది కూడా టాప్–10లో మరెంతో కాలం నిలిచేందుకు, నిలకడైన ఆటతీరుతో రాణించేందుకు నేను ట్రెసా జాలీ కష్టపడతాం. టైటిల్, టాప్–10 ర్యాంక్ మా ప్రదర్శనకు తగిన ప్రతిఫలంగా భావిస్తాం. ట్రెసా మిక్స్‌డ్‌లోనూ రాణించేందుకు శ్రమిస్తోంది.
ప్రతీ ఈవెంట్‌లో ‘మిక్స్‌డ్’ కష్టమే...
గాయత్రి గాయంతో దూరమవడంతో మిక్స్‌డ్ డబుల్స్ బరిలోకి దిగాను. ఇది ఎంతకాలం కొనసాగిస్తానో చెప్పడం కష్టం. ముఖ్యంగా మేటి టోరీ్నల్లో మహిళల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ పోటీలను సమన్వయం చేసుకోవడం క్లిష్టంగా మారుతుంది.
కోర్టులో గాయత్రితో నా సమన్వయం చక్కగా సాగుతోంది. ప్రతి టోర్నీపై మాకు స్పష్టమైన వైఖరి ఉంది. కాబట్టే ముందు మహిళల డబుల్స్‌కే ప్రాధన్యమిస్తాను. దీంతో పాటే మిక్స్‌డ్‌లో కొనసాగుతాను. ఆటలో ఏదీ అంతా సులువు కాదని నాకు తెలుసు. అందుకే ప్రతీరోజు కష్టపడాల్సి ఉంటుంది. –ట్రెసా జాలీ .
చదవండి: Lionel Messi Net Worth 2025: నెలకు రూ. 41 కోట్లకు పైగానే.. మెస్సీ నెట్‌వర్త్ ఎంతో తెలుసా?


