ఫైనల్లో కిడాంబి శ్రీకాంత్‌ | Kidambi Srikanth in the final of Syed Modi Badminton Tournament | Sakshi
Sakshi News home page

ఫైనల్లో కిడాంబి శ్రీకాంత్‌

Nov 30 2025 2:40 AM | Updated on Nov 30 2025 2:40 AM

Kidambi Srikanth in the final of Syed Modi Badminton Tournament

పుల్లెల గాయత్రి – ట్రెసా జాలీ కూడా 

సయ్యద్‌ మోడి బ్యాడ్మింటన్‌ టోర్నీ

లక్నో:  సయ్యద్‌ మోడి అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో  పురుషుల సింగిల్స్‌లో మాజీ చాంపియన్‌ కిడాంబి శ్రీకాంత్‌  తుదిపోరుకు అర్హత సాధించాడు. 2016లో ఇక్కడ విజేతగా నిలిచిన ఆంధ్రప్రదేశ్‌ టాప్‌స్టార్‌ మరోసారి టైటిల్‌ వేటలో నిలిచాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో 32 ఏళ్ల సీనియర్‌ షట్లర్‌ శ్రీకాంత్‌ 21–15, 19–21, 21–13తో మిథున్‌ మంజునాథ్‌ను ఓడించాడు. 

2021 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజత పతక విజేత అయిన తెలుగుతేజంకు గతంలో మిథున్‌ చేతిలో కీలకమైన మ్యాచ్‌ల్లో పరాజయాలు ఎదురయ్యాయి. మాజీ ప్రపంచ నంబర్‌వన్‌ శ్రీకాంత్‌ను అంతర్జాతీయ సర్క్యూట్‌లో సింగపూర్‌ ఓపెన్‌ (2022లో), థాయ్‌లాండ్‌ మాస్టర్స్‌ (2024లో) మిథున్‌ కంగుతినిపించాడు. 

డబుల్స్‌లో గాయత్రి జోడీ జోరు 
మరో వైపు డిఫెండింగ్‌ మహిళల డబుల్స్‌ చాంపియన్స్‌ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ టైటిల్‌ నిలబెట్టుకునేందుకు అడుగు దూరంలో ఉంది. గతేడాది విజేతగా నిలిచిన ప్రపంచ 14వ ర్యాంక్‌ జోడీ వరుసగా రెండో సీజన్‌లోనూ ఫైనల్‌ చేరింది. శనివారం మహిళల డబుల్స్‌ సెమీఫైనల్లో తెలంగాణ ద్వయం 21–11, 21–15తో మలేసియాకు చెందిన ఒంగ్‌ జిన్‌ యి–కార్మెన్‌ టింగ్‌లను ఓడించింది. 

అయితే మహిళల సింగిల్స్‌లో మాత్రం భారత పోరాటం ముగిసింది. ఉన్నతి హుడా, తన్వీ శర్మలిద్దరు వరుస గేముల్లోనే ప్రత్యర్థుల చేతుల్లో చిత్తయ్యారు. ఉన్నతి 15–21, 10–21తో టర్కీ షట్లర్‌ నెస్లీహాన్‌ అరిన్‌ ధాటికి చేతులెత్తేసింది.  

నజొమి ఒకుహరను కంగుతినిపించి అందర్నీ ఆకర్షించిన తన్వీ శర్మ 17–21, 16–21తో జపాన్‌కు చెందిన హిన అకెచి చేతిలో పరాజయం పాలైంది. నేడు జరిగే మహిళల డబుల్స్‌ ఫైనల్లో టాప్‌సీడ్‌ ట్రెసా–గాయత్రి జంట  కహొ ఒసావొ–మయ్‌ తనాబె (జపాన్‌) జోడీతో తలపడుతుంది. పురుషుల సింగిల్స్‌ తుదిపోరులో ఐదో సీడ్‌ శ్రీకాంత్‌... హాంకాంగ్‌కు చెందిన జాసన్‌ గునవన్‌ను ఎదుర్కొంటాడు.  

Advertisement
 
Advertisement
Advertisement