ఐపీఎల్‌ వేలంలో మనోళ్లు 17 మంది.. అదృష్టం వరించేనా | IPL 2026 Auction, Here's The List Of Telugu Players And Who Will Get Nod | Sakshi
Sakshi News home page

IPL 2026 Auction: ఐపీఎల్‌ వేలంలో మనోళ్లు 17 మంది.. అదృష్టం వరించేనా

Dec 16 2025 9:40 AM | Updated on Dec 16 2025 10:55 AM

IPL 2026 Auction: Telugu Players In List Who Will Get Nod

శ్రీకాకుళం: భారత క్రికెట్‌లో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)కు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ఒకసారైనా ఐపీఎల్‌కు ఎంపికైతే చాలని సగటు క్రికెటర్‌ కలగంటాడు. ఐపీఎల్‌కు ఎంపికైతే వారి దశ, దిశ తిరిగిపోవడం ఖాయం. ఇందుకు భారత క్రికెట్‌ జట్టుకు ప్రస్తుతం ఆడుతున్న పలువురు క్రికెటర్లే నిలువెత్తు సాక్ష్యం. 2026 మార్చి నుంచి మే నెలల్లో జరగనున్న ఐపీఎల్‌ సీజన్‌–19కు మినీ వేలం మంగళవారం యూఏఈలోని అబుదాబి వేదికగా షురూ కానుంది. వివిధ ప్రాంచైజీలు వేలంలో క్రీడాకారులను కొనుగోలు చేసే ప్రక్రియ జరగనుంది. ఈ వేలంలో జిల్లాకు చెందిన సింగుపురం దుర్గా నాగవర(ఎస్‌డీఎన్‌వీ) ప్రసాద్‌ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.

కల తీరేనా..? 
ఐపీఎల్‌ రేసులో ఉన్న యువ క్రికెటర్‌ జలుమూరు చెందిన సింగుపురం దుర్గా నాగ వర (ఎస్‌డీఎన్‌వీ)ప్రసాద్‌. గత ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ సెలక్షన్‌ ట్రయల్స్‌లో పాల్గొన్నప్పటికీ దురదృష్టవశాత్తు ఆఖరి నిమిషంలో ఎవరూ ఇంట్రస్ట్‌ చూపించలేదు. అనంతరం జరిగిన కల్నల్‌ సీకే నాయుడు అండర్‌–23 టోర్నీ, టీ–20 టోర్నీ అనేక టోరీ్నల్లో విశేషంగా రాణిస్తూ వచ్చాడు. ఏపీఎల్‌ సీజన్‌–4లో అమరావతి రాయల్స్‌ జట్టుకు రికార్డు స్థాయిలో రూ. 9.50 లక్షలకు అమ్ముడయ్యాడు. తాజాగా బీసీసీఐ నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక సయ్యద్‌ ముస్తాక్‌ అలీ సీనియర్స్‌ టీ–20 క్రికెట్‌ టోరీ్నలో కీపర్‌ కమ్‌ బ్యాటర్‌గా సత్తా చాటుతున్నాడు. దీంతో ఈసారి ఐపీఎల్‌ షార్ట్‌ లిస్టులో ఉండడంతో ఎంట్రీ దొరుకుతుందని భావిస్తున్నాడు. జలుమూరు పోలీస్‌స్టేషన్‌ వీధిలో నివాసం ఉంటున్న ఎస్‌డీఎన్‌వీ ప్రసాద్‌.. తండ్రి సింగుపురం ఉపేంద్రం కారు డ్రైవర్‌గా పనిచేస్తు 2019లో అనారోగ్యంతో మృతి చెందగా, తల్లి రేవతి జలుమూరు ఎంపీడీవో కార్యాలయంలో పనిచేస్తున్నారు.  

గతేడాది విజయ్‌ ఎంట్రీ 
గతేడాది ఐపీఎల్‌ సీజన్‌–18లో అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చి జాక్‌పాట్‌ కొట్డాడు త్రిపురాన విజయ్‌. శ్రీకాకుళం జిల్లా నుంచి ఐపీఎల్‌లో అవకాశం దక్కించుకున్న మొట్టమొదటి క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. ఈ 23 ఏళ్ల కుర్రాడిని గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్రాంచైజీ రూ.30 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఫైనల్‌ లెవన్‌లో చోటు దక్కనప్పటికీ.. పలు మ్యాచ్‌ల్లో సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలో అలరించాడు. ఐపీఎల్‌ అనంతరం ఈ ఏడాది అనేక రంజీ మ్యాచ్‌ల్లో అటు రైటార్మ్‌ ఆఫ్‌ స్పిన్‌ బౌలింగ్‌తోపాటు బ్యాటింగ్‌లోను మెరిశాడు. ఈ ఏడాది జూలైలో జరిగిన ఏపీఎల్‌ 4వ సీజన్‌లో రాణించాడు. విజయ్‌ను రూ.7.55 లక్షలకు వైజాగ్‌ లయన్స్‌ కొనుగోలు చేసింది. టెక్కలిలోని అయ్యప్పనగర్‌ కాలనీలో నివాసం ఉంటున్నారు. తండ్రి త్రిపురాన వెంకటకృష్ణరాజు సమాచారశాఖలో ఉద్యోగిగా పనిచేస్తుండగా, తల్లి లావణ్య గృహిణి. ఈ సీజన్‌లో విజయ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ మరోసారి రిటైన్‌ చేసుకుంది.

వేలంలో హైదరాబాద్, ఆంధ్ర జట్లకు చెందిన 17 మంది క్రికెటర్లు అందుబాటులో ఉన్నారు. వీరిలో భారత్‌కు ఆడిన కేఎస్‌ భరత్‌ తన కనీస విలువను రూ.75 లక్షలుగా నిర్ణయించుకోగా... మిగతా  క్రికెటర్లంతా రూ.30 లక్షల ధరలో వేలానికి సిద్ధమయ్యారు. హైదరాబాద్‌ జట్టు నుంచి 9 మంది, ఆంధ్ర నుంచి 8 మంది తమ ఐపీఎల్‌ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు.  

హైదరాబాద్‌: పేరాల అమన్‌రావు, రాహుల్‌ బుద్ధి, తనయ్‌ త్యాగరాజన్, ఆరోన్‌ జార్జి వర్గీస్, రక్షణ్‌ రెడ్డి, మనీశ్‌ రెడ్డి, నిశాంత్‌ శరణు, అర్ఫాజ్‌ మొహమ్మద్, నితిన్‌ సాయి యాదవ్‌.

ఆంధ్ర: కోన శ్రీకర్‌ భరత్, రికీ భుయ్, సత్యనారాయణ రాజు, యర్రా పృథ్వీ రాజ్, బైలాపుడి యశ్వంత్, ధీరజ్‌ కుమార్, మారం రెడ్డి హేమంత్‌ రెడ్డి, సాదిఖ్‌ హుస్సేన్‌.

అదృష్టం కలిసొస్తే.. 
శ్రీకాకుళం జిల్లా నుంచి ఐపీఎల్‌–19 సీజన్‌ వేలానికి ఎస్‌డీఎన్‌వీ ప్రసాద్‌ రేసులో ఉన్నాడు. గతేడాది త్రిపురాన విజయ్‌ ఎంపికవ్వడం జరిగింది. వీరితో మరింత మందికి అవకాశం దొరకాలని ప్రయత్నాలు చేస్తున్నాం. అదృష్టం కలిసొస్తే మినీ వేలంలో ఎంపిక పెద్ద కష్టమేమీ కాదు.

సమష్టిగా కష్టపడుతున్నాం 
గత మూడేళ్లుగా జిల్లాలో క్రికెట్‌ అభివృద్ధి కోసం అనేక యాక్టివిటీస్‌ను చేపడుతున్నాం. సొంత నిధులు వెచ్చిస్తున్నాం. క్రికెటర్ల అభివృద్ధి, గుర్తింపు కోసం సమష్టిగా కష్టపడుతున్నాం. గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్‌కు విజయ్‌ ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఏడాది జరిగే ఐపీఎల్‌ మినీ వేలంలో మరొకరికి అవకాశం దొరుకుతుందని భావిస్తున్నాం.                   
 – ఇలియాస్‌ మహ్మద్, మెంటార్, జిల్లా క్రికెట్‌ సంఘం శ్రీకాకుళం   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement