ముంబై: ప్రస్తుత భారత జట్టులోని క్రికెటర్లు ఎవరైనా సరే దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీకి దూరం కావద్దని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పష్టం చేసింది. అవకాశం ఉంటే అన్ని మ్యాచ్‌లు ఆడాలని... లేదా కనీసం రెండు మ్యాచ్‌లు ఆడాలని సీనియర్ సెలక్షన్ కమిటీ ఆదేశించింది.
కాగా డిసెంబర్ 24 నుంచి విజయ్ హజారే ట్రోఫీ జరుగుతుంది. ఇదిలా ఉంటే.. దక్షిణాఫ్రికాతో భారత్ చివరి టీ20 జరిగే డిసెంబర్ 19, న్యూజిలాండ్‌తో తొలి వన్డే జరిగే జనవరి 11 మధ్య సమయంలో అవకాశం ఉన్న అన్ని మ్యాచ్‌లు ఆడాలని బోర్డు తేల్చి చెప్పింది.
రో-కోలకు మా త్రమే కాకుండా
ఇక భారత్ తరఫున ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకే కాకుండా ఇతర రెగ్యులర్ క్రికెటర్లకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. దక్షిణాఫ్రికాతో రెండో టి20 ముగియగానే ఆటగాళ్లకు ఈ విషయాన్ని బోర్డు వెల్లడించినట్లు సమాచారం.
అదే విధంగా.. ఎవరైనా ఆటగాడు గాయంతో బాధపడుతూ ఆడలేని స్థితిలో ఉన్నట్లు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) అన్‌ఫిట్‌గా తేలిస్తేనే వారికి సడలింపు ఉంటుంది. జనవరి మొదటి వారంలో ఒకే రోజు న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్, టీ20 వరల్డ్ కప్ జట్లను సెలక్టర్లు ప్రకటించే అవకాశం ఉంది.
మరోవైపు.. కుటుంబ సన్నిహితులు ఒకరు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడంతోనే జస్‌ప్రీత్ బుమ్రా ధర్మశాలలో మూడో టీ20 మ్యాచ్‌కు దూరమైనట్లు తెలిసింది. అంతా బాగుంటేనే అతడు తర్వాతి మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడు.
క్రీడాసమాఖ్యల జాబితాలో బీసీసీఐ లేదు!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్‌ఎస్‌ఎఫ్)ల జాబితాలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) లేదని క్రీడా మంత్రి మన్‌సుఖ్ మాండవీయ స్పష్టం చేసారు.
త్వరలో అమల్లోకి రానున్న కొత్త క్రీడా చట్టానికి సంబంధించి లోక్‌సభలో జరిగిన చర్చపై జవాబిస్తూ మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. బీసీసీఐని ప్రభుత్వ నియంత్రణలోకి తెచ్చే అవకాశం ఉందా అంటూ టీఎంసీ ఎంపీ మాల రాయ్ అడిగిన ప్రశ్నకు మాండవీయ సమాధానమిచ్చారు.
చదవండి: IND vs SA: అక్షర్ పటేల్ స్థానంలో అతడే.. బీసీసీఐ ప్రకటన


