దుబాయ్: మహిళల వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన భారత క్రికెటర్ షఫాలీ వర్మకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) పురస్కారం లభించింది. మహిళల విభాగంలో నవంబర్ నెలకుగాను షఫాలీ వర్మ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’గా ఎంపికైంది. ముంబైలో దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో షఫాలీ 78 బంతుల్లో 87 పరుగులు చేయడంతోపాటు 2 వికెట్లు పడగొట్టింది.
ఓపెనర్ స్మృతి మంధానతో కలిసి తొలి వికెట్‌కు 104 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఇక ఐసీసీ అవార్డు గెలుచుకున్న సందర్భంగా హరియాణాకు చెందిన షఫాలీ వర్మ మాట్లాడుతూ.. ‘నా తొలి ప్రపంచకప్ నేను ఊహించిన విధంగా గొప్ప అనుభవమైతే ఇవ్వలేదు. అయితే ముగింపు మాత్రం నేను అనుకున్నదానికంటే బాగా జరిగింది.
వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో భారత విజయంలో నా వంతు పాత్ర పోషించినందుకు గర్వంగా ఉంది. నవంబర్ నెలకుగాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా ఎంపికైనందుకు ఆనందంగా ఉంది’ అని వ్యాఖ్యానించింది.
నంబర్ 4
ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డు గెల్చుకున్న నాలుగో భారతీయ మహిళా క్రికెటర్‌గా షఫాలీ గుర్తింపు పొందింది. గతంలో హర్మన్‌ప్రీత్ కౌర్ (2022 సెపె్టంబర్), దీప్తి శర్మ (2023 డిసెంబర్), స్మృతి మంధాన (2024 జూన్; 2025 సెప్టెంబర్) ఈ అవార్డు సొంతం చేసుకున్నారు.
ఇదిలా ఉంటే.. పురుషుల విభాగంలో దక్షిణాఫ్రికా స్పిన్నర్ సైమన్ హార్మర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డు గెల్చుకున్నాడు. భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో హర్మర్ 17 వికెట్లు పడగొట్టి తమ జట్టు 2–0తో టీమిండియాను వైట్‌వాష్ చేయడంలో కీలకపాత్ర పోషించాడు.
చదవండి: మాక్ వేలంలో రూ. 30.50 కోట్లకు అమ్ముడుపోయిన గ్రీన్.. ఎవరు కొన్నారంటే?


