సౌతాఫ్రికాతో జరిగే చివరి రెండు టీ20 మ్యాచ్‌లకు టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ దూరమయ్యాడు. అనారోగ్యం కారణంగా అతడు ఈ సిరీస్ నుంచి తప్పుకొన్నాడు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ధ్రువీకరించింది.
సఫారీ జట్టుతో నాలుగో టీ20 కోసం జట్టు సహచరులతో పాటు లక్నోకు వచ్చినా... వైద్యుల సూచనల మేరకు తర్వాతి మ్యాచ్‌లు ఆడరాదని అక్షర్ (Axar Patel) నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు ఆడిన అక్షర్ ధర్మశాలలో జరిగిన మూడో టీ20లో కూడా బరిలోకి దిగలేదన్న సంగతి తెలిసిందే.
అక్షర్ స్థానంలో
మరోవైపు.. అక్షర్ స్థానంలో మరో లెఫ్టార్మ్ స్పిన్ ఆల్‌రౌండర్ షహబాజ్ అహ్మద్ (Shahbaz Ahmed)ను సెలక్టర్లు ఎంపిక చేశారు. బెంగాల్‌కు చెందిన 31 ఏళ్ల షహబాజ్ టీమిండియా తరఫున ఇప్పటి వరకు 3 వన్డేలు, 2 టీ20లు ఆడి మొత్తం 5 వికెట్లు పడగొట్టాడు. హాంగ్జూలో జరిగిన 2023 ఆసియా క్రీడల్లో అతను చివరిసారిగా టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు.
ఇదిలా ఉంటే.. స్వదేశంలో సౌతాఫ్రికాతో ఆల్ ఫార్మాట్ల సిరీస్‌తో బిజీగా ఉన్న టీమిండియా.. టెస్టుల్లో 2-0తో వైట్‌వాష్ అయిన విషయం తెలిసిందే. అయితే, ఆ తర్వాత మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో గెలుచుకుని ఊరట పొందింది.
2-1తో ఆధిక్యం
ఈ క్రమంలో కటక్ వేదికగా తొలి టీ20లో సఫారీలను 101 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించిన భారత జట్టు.. ముల్లన్‌పూర్‌లో మాత్రం 51 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఇక ధర్మశాలలో ఆదివారం నాటి మ్యాచ్‌లో గెలిచి మళ్లీ విజయం బాట పట్టిన టీమిండియా.. 2-1తో ఆధిక్యం సంపాదించింది.
ఇక లక్నోలో బుధవారం నాటి మ్యాచ్‌లోనూ గెలుపొంది మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. కాగా మూడో టీ20లో అక్షర్ పటేల్‌తో పాటు ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా సేవలను కూడా టీమిండియా కోల్పోయింది. వ్యక్తిగత కారణాల దృష్ట్యా బుమ్రా ఇంటికి వెళ్లిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే, అతడి రీఎంట్రీ గురించి మాత్రం బీసీసీఐ నుంచి ఇప్పటి వరకు అప్‌డేట్ లేదు.
చదవండి: మాక్ వేలంలో రూ. 30.50 కోట్లకు అమ్ముడుపోయిన గ్రీన్.. ఎవరు కొన్నారంటే?


