సౌతాఫ్రికాతో మూడో టీ20లో గెలిచి జోరు మీదున్న టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. అనారోగ్యం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ ఒకరు.. మిగిలిన రెండు టీ20లకు కూడా అందుబాటులో ఉండటం లేదని సమాచారం. ఇంతకీ ఎవరా ఆటగాడు?
స్వదేశంలో సౌతాఫ్రికా చేతిలో టెస్టుల్లో 2-0తో వైట్‌వాష్‌కు గురైన భారత జట్టు.. వన్డే సిరీస్ (IND vs SA)ను 2-1తో గెలిచింది. ఇదే జోరులో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో కటక్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో ఏకంగా 101 పరుగులతో సఫారీలను చిత్తు చేసిన టీమిండియా.. ముల్లన్‌పూర్‌లో 51 పరుగుల తేడాతో ఓడిపోయింది.
గెలుపుబాట పట్టిన సూర్య సేన..
ఈ క్రమంలో ధర్మశాలలో ఆదివారం నాటి మూడో టీ20లో సత్తా చాటి తిరిగి గెలుపుబాట పట్టిన సూర్య సేన.. 2-1తో ఆధిక్యంలోకి వచ్చింది. అయితే, ఈ మ్యాచ్‌లో భారత్ తమ తుదిజట్టులో రెండు మార్పులతో బరిలోకి దిగింది. ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా వ్యక్తిగత కారణాలతో దూరం కాగా.. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు విశ్రాంతినిచ్చారు.
అక్షర్ పటేల్ అవుట్!
అయితే, తాజా సమాచారం ప్రకారం అక్షర్ పటేల్ (Axar Patel) అనారోగ్యం బారిన పడ్డాడని.. మిగిలిన రెండు మ్యాచ్‌లకు కూడా దూరమయ్యాడని వార్తలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే ఇప్పటికే బుమ్రా రూపంలో కీలక బౌలర్ దూరం కాగా.. అక్షర్ కూడా అందుబాటులో లేకుంటే తుదిజట్టు కూర్పు విషయంలో కాస్త గందరగోళం నెలకొనవచ్చు.
కాగా కటక్‌లో 23, ముల్లన్‌పూర్‌లో 21 పరుగులు చేసిన అక్షర్ పటేల్.. ఆయా మ్యాచ్‌లలో రెండు (2/7), ఒక వికెట్ (1/27) పడగొట్టాడు. మరోవైపు.. అక్షర్ స్థానంలో మూడో టీ20లో ఆడిన చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లతో మెరిశాడు. ఇదిలా ఉంటే.. భారత్- సౌతాఫ్రికా మధ్య నాలుగో టీ20 లక్నోలో బుధవారం జరుగనుండగా.. శుక్రవారి నాటి ఆఖరి మ్యాచ్‌కు అహ్మదాబాద్ వేదిక.
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు బీసీసీఐ ప్రకటించిన ప్రాథమిక జట్టు
అభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా.


