సౌతాఫ్రికాతో మూడో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. ధర్మశాల వేదికగా సఫారీలను ఏడు వికెట్ల తేడాతో ఓడించి 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో.. గత మ్యాచ్ వైఫల్యాలను అధిగమించి తాజా టీ20లో గెలవడం పట్ల కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ హర్షం వ్యక్తం చేశాడు.
విజయానంతరం మాట్లాడుతూ.. ‘‘క్రీడలు మనకు ఎన్నో విలువైన పాఠాలు నేర్పుతాయి. ఈ సిరీస్‌లో తిరిగి పుంజుకుని ఆధిక్యంలోకి రావడం అత్యంత ముఖ్యమైన విషయం. మేము ప్రస్తుతానికి ఆ పనిని పూర్తి చేశాము.
మా బౌలర్లు సూపర్
కటక్‌లో జరిగిన తొలి టీ20లో మాదిరి ప్రాథమిక స్థాయి అంశాల మీద కూడా దృష్టి పెట్టాము. అందుకు తగ్గ ఫలితాన్ని పొందాము కూడా!.. చండీగఢ్ (ముల్లన్‌పూర్)లో జరిగిన రెండో టీ20 మ్యాచ్ సందర్భంగా మేము చాలా విషయాలు నేర్చుకున్నాము. ముఖ్యంగా ఈసారి మా బౌలర్లంతా సమిష్టిగా రాణించడం కలిసి వచ్చింది.
నెట్స్‌లో నేను అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నా
ఆ మ్యాచ్‌లో ఓటమి తర్వాతి సమావేశంలో మా తప్పొప్పుల గురించి లోతుగా చర్చించుకున్నాము. కఠినంగా సాధన చేశాము. ఈ మ్యాచ్‌లో మేము ప్రయోగాలకు పోలేదు. ఇక నా బ్యాటింగ్ విషయానికొస్తే.. నెట్స్‌లో నేను అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాను.
కానీ మ్యాచ్‌లో విఫలమవుతున్నాను. నా ఆధీనంలో ఉన్న ప్రతి పనిని విజయవంతంగా నిర్వహించేందుకు నేను శాయశక్తులా ప్రయత్నిస్తాను. సరైన సమయంలో సరైన విధంగా ఆడితే పరుగులు వాటంతట అవే వస్తాయి. నేను ఫామ్‌లో లేనని అనుకోను.
అయితే, వీలైనన్ని ఎక్కువ పరుగులు మాత్రం రాబట్టాల్సి ఉంది. ప్రస్తుతం ఈ గెలుపును ఆస్వాదిస్తున్నాం. తదుపరి లక్నో మ్యాచ్‌పై దృష్టి సారిస్తాం’’ అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు. కాగా ధర్మశాల వేదికగా టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ చేసింది.
117 పరుగులే చేసి ఆలౌట్
భారత బౌలర్ల విజృంభణకు సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 117 పరుగులే చేసి ఆలౌట్ అయింది. కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ (46 బంతుల్లో 61) ఒక్కడే మెరుగైన ఇన్నింగ్స్ ఆడగా.. మిగతా వారిలో ఫెరీరా(20) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు.
టీమిండియా పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా చెరో రెండు వికెట్లు కూల్చగా.. ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, శివం దూబే తలా ఒక వికెట్ తీశారు.
స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 15.5 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (18 బంతుల్లో 35) ధనాధన్ దంచికొట్టగా.. శుబ్‌మన్ గిల్ (28 బంతుల్లో 28) ఫర్వాలేదనిపించాడు.
మరోసారి సూర్య విఫలం
వన్‌డౌన్‌లో వచ్చిన తిలక్ వర్మ 34 బంతుల్లో 25 పరుగులతో అజేయంగా నిలవగా.. కెప్టెన్ సూర్య (12) మరోసారి విఫలమయ్యాడు. తిలక్‌తో కలిసి శివం దూబే (4 బంతుల్లో 10 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చాడు.
కాగా సూర్యకుమార్ యాదవ్ భారత టీ20 జట్టు పూర్తి స్థాయి కెప్టెన్ అయిన తర్వాత బ్యాటర్‌గా దారుణంగా విఫలమవుతున్నాడు. ముఖ్యంగా పేసర్లను ఎదుర్కోవడంలో తడబడుతున్నాడు.
ఈ ఏడాది 18 ఇన్నింగ్స్‌లో పేసర్ల బౌలింగ్‌లో 14సార్లు అతడు అవుట్ అయ్యాడు. మొత్తంగా 106 బంతులు ఎదుర్కొని 8.71 సగటుతో కేవలం 122 పరుగులు చేశాడు. ఇక ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా టీమిండియా- సౌతాఫ్రికా మధ్య బుధవారం నాలుగో టీ20 జరుగుతుంది. ఇందుకు వేదిక లక్నో.
చదవండి: Messi: ‘గోట్ టూర్’ చీఫ్ ఆర్గనైజర్ జైలుకు!
#ShivamDube finishes things off in style and Team India go 2–1 up in the series.🔥#INDvSA, 4th T20I 👉 WED, DEC 17, 6 PM pic.twitter.com/OjhdlpHs7G
— Star Sports (@StarSportsIndia) December 14, 2025


