ముంబైని మురిపించిన దిగ్గజాల భేటీ
వాంఖెడేలో అర్జెంటీనా స్టార్ సందడి
నేడు ఢిల్లీకి
ముంబై: అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లయోనల్ మెస్సీ తన ‘గోట్ టూర్’లో భాగంగా రెండో రోజు ముంబైని మురిపించాడు. భారత మాస్టర్ సచిన్ టెండూల్కర్‌తో కలిసి వాంఖెడేలో సందడి చేశాడు. మామూలుగా అయితే ఈ మైదానంలో టెండూల్కర్ ఉంటే ‘సచిన్... సచిన్...’ అనే గోలే వినిపించేది. కానీ ఆదివారం స్వరం మారింది. యువ తరం, నవతరం అంతా కలిసి తమ ఆరాధ్య క్రికెటర్‌తో పాటు అభిమాన ఫుట్‌బాలర్ పేరునూ మార్మోగించారు.
దీంతో వాంఖెడే స్టేడియం ‘సచిన్... సచిన్... మెస్సీ... మెస్సీ...’ నామస్మరణతో మార్మోగిపోయింది. సచిన్, మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, భారత ఫుట్‌బాల్ దిగ్గజం సునీల్ ఛెత్రితో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవ్‌గణ్, టైగర్ ష్రాఫ్, అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్, పలువురు సెలబ్రిటీలతో స్టేడియమంతా తారతోరణం దిద్దుకుంది.

వాంఖెడే పుటల్లో ఈ పూట
క్రీడా ప్రపంచంలోనే అలుపెరగని దిగ్గజాలు ప్రత్యక్షంగా మైదానాన్ని, పరోక్షంగా యావత్ భారత్‌ను అలరించారు. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లోని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన పురిటి గడ్డపై జగద్విఖ్యాత ఫుట్‌బాలర్ లయోనల్ మెస్సీతో కలిసి సందడి చేశాడు. వాంఖెడే స్టేడియంలో దిగ్గజాల భేటీతో సరికొత్త అధ్యాయం ప్రారంభించినట్లయ్యింది. పోటెత్తిన అభిమానులతో కిక్కిరిసిపోయిన స్టేడియంలో వీరిద్దరే కేంద్ర బిందువులయ్యారు.
భారత ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్ సునీల్ ఛెత్రి, రాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సహా పుర ప్రముఖులు ఎందరున్నా... వేల కళ్లు సచిన్–మెస్సీల నుంచి చూపును తిప్పుకోలేకపోయాయి. ముఖ్యంగా భారత క్రికెట్ అభిమానులు తమ ఆరాధ్య దిగ్గజం సచిన్‌ను విఖ్యాత ఫుట్‌బాలర్‌తో కన్నుల పండుగగా చూసుకున్నారు.

ఈ సందర్భంగా మహా సీఎం ఫడ్నవీస్ రాష్ట్రంలో యువ ఫుట్‌బాలర్ల ప్రతిభను సానబెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘ప్రాజెక్ట్ మహాదేవ’ పేరిట ఫుట్‌బాల్ ప్రతిభావంతుల్ని తయారు చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని ముఖ్యమంత్రి ప్రకటించారు.
అపురూపం... పరస్పర బహుమానం
అర్జెంటీనా స్టార్‌కు టెండూల్కర్ తను స్వయంగా ఆటోగ్రాఫ్ చేసిన వన్డే జెర్సీని మెస్సీకి అందివ్వగా... ప్రతిగా మెస్సీ కూడా తన సంతకంతో కూడిన ఫుట్‌బాల్‌ను సచిన్‌కు ఇచ్చాడు. అన్నట్లు ఆటలు వేరైనా... దేశాలు వేరైనా... సచిన్ జెర్సీ నంబర్, మెస్సీ జెర్సీ నంబర్ ఒక్కటే 10! అదేనండీ ‘దస్‌కా దమ్’’! దిగ్గజాలు పరస్పర బహుమతులు ఇస్తూ స్వీకరిస్తుంటే అభిమానులంతా ఉప్పొంగిపోయారు. ఈ అపు‘రూపం’ను తమ ఫోన్ కెమెరాల్లో పదిలంగా బందీచేసుకున్నారంతా!
నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ...
‘గోట్ టూర్’లో భాగంగా అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లయోనల్ మెస్సీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఈరోజు మర్యాదపూర్వకంగా కలువనున్నాడు. మూడు రోజుల ‘గోట్ టూర్’ నేడు ఢిల్లీలో ముగియనుంది. ముంబై నుంచి సోమవారం ఉదయం 10 గంటల తర్వాత మెస్సీ ఢిల్లీ చేరుకుంటాడు. నగరంలోని క్రీడాభిమానులతో ‘మీట్ అండ్ గ్రీట్’ ముగించుకొన్న తర్వాత మెస్సీ... ప్రధాని మోదీతో భేటీ అవుతాడు.
ప్రధాని నివాసంలో దాదాపు 20 నిమిషాల పాటు వీరిద్దరి మధ్య జరిగే మాటామంతీలో సాకర్ సూపర్ స్టార్ ఫుట్‌బాల్ ముచ్చట్లు పంచుకోకున్నాడు. ఆ తర్వాత భారత సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చీఫ్ రాహుల్ నవీన్, అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు, ఎంపీ ప్రఫుల్ పటేల్‌తో కూడా మెస్సీ భేటీ అవుతారని నిర్వాహకులు వెల్లడించారు.
ఇలా పలువురు వీవీఐపీలను కలిసిన తర్వాత మెస్సీ మధ్యాహ్నం 3.30 గంటలకు అరుణ్ జైట్లీ స్టేడియానికి చేరుకుంటాడు. అక్కడ తన అభిమానుల్ని అలరించిన అనంతరం స్వదేశానికి పయనమవుతాడని నిర్వాహకులు వెల్లడించారు.
నాకు ఇక్కడ (వాంఖెడే) మరుపేలేని మధుర జ్ఞాపకాలెన్నో ఉన్నాయి. అందుకే మన ముంబై ఒక కలల నగరి. ఈ వేదికపై ఎంతో మంది స్వప్నాలు సాకారమయ్యాయి. 2011 నాకు బాగా గుర్తు. నా కల (వన్డే వరల్డ్‌కప్) కూడా ఇక్కడే నిజమైంది.
ముఖ్యంగా మీ (అభిమానులు) మద్దతే లేకపోతే ఆ స్వర్ణానుభూతిని నేనైతే ఎప్పటికీ చూడలేను. ఇప్పుడు కూడా మెస్సీని ఇక్కడ చూస్తుంటే అలాంటి అనుభూతే కలుగుతోంది. మన యువ ఫుట్‌బాలర్లను ప్రోత్సహించిన మెస్సీకి మీ అందరి తరఫున, భారతీయుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. –సచిన్ టెండూల్కర్


