కటక్: ఒడిశా మాస్టర్స్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నీ సింగిల్స్ విభాగంలో భారత్‌కు రెండు టైటిల్స్ లభించాయి. మహిళల సింగిల్స్‌లో హరియాణాకు చెందిన 18 ఏళ్ల ఉన్నతి హుడా... పురుషుల సింగిల్స్‌లో కేరళకు చెందిన కిరణ్ జార్జి చాంపియన్స్‌గా అవతరించారు. ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో ప్రపంచ 28వ ర్యాంకర్ ఉన్నతి 21–17, 21–10తో భారత్‌కే చెందిన ప్రపంచ 53వ ర్యాంకర్ ఇషారాణి బారువాను ఓడించింది.
31 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఉన్నతికి తొలి గేమ్‌లో కాస్త పోటీ ఎదురైంది. రెండో గేమ్‌లో మాత్రం ఆరంభం నుంచే ఉన్నతి జోరు కొనసాగింది. పురుషుల సింగిల్స్ తుది పోరులో ప్రపంచ 41వ ర్యాంకర్ కిరణ్ జార్జి 21–14, 13–21, 21–16తో ప్రపంచ 77వ ర్యాంకర్ మొహమ్మద్ యూసుఫ్ (ఇండోనేసియా)పై విజయం సాధించింది.
65 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రెండో గేమ్‌లో తడబడ్డ కిరణ్ నిర్ణాయక మూడో గేమ్‌లో కీలకదశలో పాయింట్లు గెలిచి టైటిల్‌ను ఖాయం చేసుకున్నాడు. విజేతలుగా నిలిచిన ఉన్నతి, కిరణ్‌లకు 8,250 డాలర్ల (రూ. 7 లక్షల 46 వేలు) చొప్పున ప్రైజ్‌మనీతోపాటు 5,500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.


