భారత్ నుంచి 14,000 పేటెంట్లను దాఖలు చేసినట్లు శాంసంగ్ వెల్లడించింది. అంతర్జాతీయంగా అర్థవంతమైన నవకల్పనలను ఆవిష్కరించడంలో కొత్త శకానికి భారత్ సారథ్యం వహిస్తుందని ఆశిస్తున్నట్లు దేశీయంగా కార్యకలాపాలు ప్రారంభించి 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కంపెనీ తెలిపింది.
‘భారత్ నుంచి 14,000 పైగా పేటెంట్లు దాఖలయ్యాయి. తద్వారా గ్లోబల్ ఆవిష్కరణలకు కేంద్రంగా భారత్ స్థానం మరింత పటిష్టం అయింది. రాబోయే దశాబ్దకాలంలో ప్రపంచం కోసం భారత్‌లో డిజైన్ చేసిన, తయారు చేసిన మరిన్ని ఉత్పత్తులు రాబోతున్నాయి‘ అని శాంసంగ్ సౌత్‌వెస్ట్ ఏషియా ప్రెసిడెంట్, సీఈవో జేబీ పార్క్ వివరించారు.
వికసిత్ భారత్ లక్ష్యాల సాకారం దిశగా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు. 1995లో టీవీలతో దేశీ మార్కెట్లోకి ప్రవేశించిన శాంసంగ్ క్రమంగా కార్యకలాపాలను విస్తరించింది. చెన్నై, నోయిడాలో రెండు ప్లాంట్లను, ఢిల్లీ, నోయిడా, బెంగళూరులో మూడు పరిశోధన.. అభివృద్ధి కేంద్రాలను, ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో డిజైన్ సెంటర్‌ని ఏర్పాటు చేసింది.


