ఒకప్పుడు కంటికి కనిపించే మరయంత్రాలు.. ఇప్పుడు కానరాకుండానే అద్భుతాలు చేస్తున్నాయి. నిమిషాల్లో.. కాదు చిటికేసేలోపే పనులన్నీ చక్కబెట్టేస్తున్నాయి. ఆఖరికి.. మనం తీసుకునే నిర్ణయాలనూ ప్రభావితం చేసేస్తున్నాయి. కృత్రిమ మేధస్సు (AI) అనేది ఇప్పుడు కేవలం టెక్నాలజీ మాత్రమే కాదు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక శక్తి కూడా.
ఆరోగ్యం నుంచి విద్య వరకు.. బ్యాంకింగ్ నుంచి వినోదం దాకా.. ప్రతీ రంగంలోనూ ఏఐ తన ముద్రను వేసేసుకుంది. క్రితంతో పోలిస్తే 2025లో వాడకం బాగా పెరిగింది. ఏఐ అభివృద్ధి, పరిశోధన, మోడల్ డెవలప్‌మెంట్‌లో ప్రపంచంలోకెల్లా అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. సిలికాన్ వ్యాలీ, ఎంఐటీ, స్టాన్‌ఫోర్డ్ వంటి పరిశోధనా కేంద్రాలు కొత్త మోడళ్లను రూపొందిస్తూ.. ఏఐ ఆవిష్కరణల్లో అగ్రరాజ్యాన్ని ముందంజలో ఉంచాయి. కానీ,
ప్రపంచవ్యాప్తంగా.. 87% కంపెనీలు ఏఐని తమ వ్యాపార ప్రణాళికల్లో ప్రధాన ప్రాధాన్యంగా గుర్తించాయి. మొత్తంగా 76% సంస్థలు కనీసం ఒక విభాగంలో ఏఐని వాడుతున్నాయి
వాస్తవ వినియోగం విషయంలో మాత్రం అత్యధిక జనాభా ఉన్న చైనా (58%), భారతదేశం (57%) ఏఐని అత్యధికంగా ఉపయోగిస్తున్నాయి. చైనాలో ఆరోగ్యం, తయారీ, ప్రభుత్వ సేవల్లో AI విస్తృతంగా అమలవుతోంది. భారతదేశంలో బ్యాంకింగ్, ఈ-కామర్స్, డిజిటల్ గవర్నెన్స్ రంగాల్లో AI వినియోగం వేగంగా పెరుగుతోంది. ఈ రెండు దేశాలు పెద్ద జనాభా, విస్తృత మార్కెట్ కారణంగా AIని ప్రాక్టికల్‌గా ఉపయోగించడంలో ముందున్నాయి. అదే సమయంలో.. ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో చూస్తే చైనా కంటే మన దేశమే ముందంజలో ఉంది. అయితే.. ఏఐని సమర్థవంతంగా వినియోగిస్తున్న దేశాలు ఏంటో తెలుసా?..
ఏఐ వినియోగంలో చిన్న దేశాలు వెనుకబడలేదు. యూరప్‌లోని చిన్న కంట్రీ అయిన ఎస్టోనియా ప్రపంచంలోనే ఏఐని అతి సమర్థవంతంగా వినియోగించుకుంటున్న దేశంగా గుర్తింపు దక్కించుకుంది. డిజిటల్ పాలసీలతో పాటు ఈ-పౌరసత్వం, డిజిటల్ ఐటీ వంటి ప్రాజెక్టుల కోసం పూర్తిగా ఏఐనే ఉపయోగించుకుంటోందా దేశం. ఈ లిస్ట్‌లో తర్వాత సింగపూర్ ఉంది. అక్కడి స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు, ట్రాన్స్‌పోర్ట్ మేనేజ్‌మెంట్, పబ్లిక్ సర్వీసుల్లోనూ AIని అత్యుత్తమంగా ఉపయోగిస్తున్నారు. స్పష్టమైన పాలసీలు, సమర్థవంతమైన అమలుతోనే ఇది సాధ్యమైందని సింగపూర్ ఈ మధ్యే గొప్పగా ప్రకటించుకుంది కూడా.
ఇక.. మన దేశంలో ఏఐని విచ్చలవిడిగా వాడుతోంది చూస్తున్నదే!. అయితే యూరప్‌లో మాత్రం ఏఐ తరహా కంటెంట్ వాడకంపై ఆంక్షలు ఉన్నాయి. ఈయూ AI Act ద్వారా ఎథికల్ AI వినియోగానికి(ఎలా పడితే అలా వాడడానికి వీల్లేకుండా..) స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.
మిడిల్ ఈస్ట్ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈలు ఏఐని తక్కువేం వాడడం లేదు. ఏఐ కంప్యూటింగ్ పవర్‌లో భారీగా పెట్టుబడులు పెడుతూ.. భవిష్యత్తులో గ్లోబల్ AI హబ్‌లుగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.
దక్షిణ కొరియాలో ప్రభుత్వం ఉద్యోగులకు AI అక్షరాస్యతలో భాగంగా ప్రత్యేక శిక్షణ ఇస్తోంది.
మొత్తంగా.. ప్రపంచ ఏఐ దృశ్యం ఇప్పుడు పెద్ద దేశాల ఆధిపత్యంతో పాటు చిన్న దేశాల సమర్థవంతమైన వినియోగం అనే ద్వంద్వ రూపంలో ఉందని చెప్పొచ్చు.


