ఆకాశం.. ఓ అద్భుతం.. దానిలో కనిపించే దృశ్యాలు మహాద్భుతం.. ఇలాంటి అపురూప దృశ్యాలను చూసేందుకు ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు ఆకాశంలో మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. ఇందుకోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. 2025, డిసెంబర్ 13–14 రాత్రి జెమినిడ్స్ ఉల్కాపాతం ఉతృష్ట స్థాయికి చేరి కనువిందు చేయనుంది. ఇది ఈ ఏడాదిలోకెల్లా అత్యంత అరుదైన దృశ్యంగా నిలిచిపోనుంది. నింగిని చీల్చుకుంటూ మెరుపులు వెదజల్లుతూ దూసుకుపోయే ఈ ‘షవర్’ను చూసేందుకు ఖగోళ ప్రేమికులతో పాటు ప్రపంచ ప్రజలంతా సిద్ధమవుతున్నారు.

14 తెల్లవారుజామున మ్యాజిక్
ఈ అద్భుతాన్ని పూర్తి స్థాయిలో చూడాలంటే, డిసెంబర్ 14న తెల్లవారుజాము 2 నుండి 4 గంటల మధ్య మేల్కొని ఉండాలి. ఇదే దీనిని వీక్షించేందుకు అత్యుత్తమ సమయం.ఈ కీలక సమయంలోనే మన భూమి ఉల్కా శిథిలాల మార్గంలోకి సంపూర్ణంగా ప్రవేశిస్తుంది. ఆ సమయంలో ఈ ఉల్కలు వేగంగా కిరణాల్ల మాదిరిగా ఉద్భవించి, ఆకాశాన్ని మరింతగా ప్రకాశింపజేస్తాయి.
ఇటువంటి స్థలంలో..
జెమినిడ్స్ అద్భుతాన్ని కనులారా చూడాలంటే, కేవలం సమయం మాత్రమే కాదు.. స్థలం కూడా ముఖ్యం. చీకటిగా, స్పష్టంగా ఆకాశం కనిపించే ప్రదేశాన్ని ఎంచుకోండి. ఇందుకోసం నగరపు కాంతి కాలుష్యం లేని ప్రాంతానికి వెళ్లడం ఉత్తమం. అర్ధరాత్రి దాటి, తెల్లవారుజాము వరకు గల సమయంలోనే ‘రేడియంట్’ (ఉల్కలు వచ్చే ప్రాంతం) హృద్యంగా కనిపిస్తుంది.

ఇంట్లో నుంచే విశ్వ విందు
క్షేత్ర స్థాయిలో ఈ అద్భుతాన్ని చూడలేని వారికి నిరాశ చెందనక్కర్లేదు. సాంకేతికత మనకు తోడుంది! ఇటలీలోని అబ్జర్వేటరీ నుండి వర్చువల్ టెలిస్కోప్ ప్రాజెక్ట్ లాంటి సంస్థలు ఈ మెరుపుల ప్రదర్శనను రియల్‌టైమ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. ఫలింతంగా మీరు ఇంట్లో కూర్చునే ఈ ఖగోళ అద్భుతాన్ని ప్రపంచంలో ఎక్కడి నుండైనా వీక్షించవచ్చు.
2025లో అద్బుత జ్ఞాపకం
2025 చివరిలో కనిపించే ఈ జెమినిడ్స్ కేవలం ఒక సాధారణ ఖగోళ సంఘటన కాదు. ఇది విశ్వశక్తిని, అందాన్ని తెలియజేసే మరపురాని ప్రదర్శన. అందుకే రాత్రిపూట ఆకాశంలో జరిగే ఈ మెరుపుల వేడుకను చూడటానికి సిద్ధమవ్వండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఈ అద్భుతమైన ఖగోళ విందు గురించి చెప్పి, వారితో కలిసి ఆకాశంలో అద్భుతాన్ని వీక్షించేందుకు ప్లాన్ చేసుకోండి.
ఇది కూడా చదవండి: ‘గోవా కలెక్టర్ ఫోన్ చేసి..’ బిగ్గరగా రోదించిన బాధితురాలు..


