దెయ్యపు వెలుగులు?
ఎర్రని ఎరుపు రంగుతో వింతగా మెరిసిపోయే వెలుతురు స్తంభాలు. రకరకాల ఆకృతుల్లో చూపరులకు కనువిందు చేసే తీరు వర్ణించనలవి కాదు. ఇంతా చేసి విను వీధిలో అవి కనువిందు చేసేది రెప్పపాటు కన్నా కూడా తక్కువసేపు మాత్రమే. అలా ఇటీవల ఆకాశంలో కనిపించిన ఈ వింత వెలుగులను అమెరికాకు చెందిన ఔత్సాహిక ఫోటోగ్రాఫర్ ఒకరు కెమెరాలో బంధించి ఇదుగో, ఇలా అందరి కంటికీ విందు చేశారు...!
స్ప్రైట్స్ స్ప్రైట్స్...!
ఈ అందాల వెలుగులను సైంటిస్టులు స్ప్రైట్స్ గా పిలుస్తారు. కనిపించేది ఒక క్షణంలో కొద్దిసేపు పాటే అయినా, ఆకాశంలో అల్లంత ఎత్తు నుంచి అమాంతం రాలిపడుతూ విస్మయపరచడం వీటి ప్రత్యేకత. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగాత్మకంగా చేపట్టిన స్ప్రైటాక్యులర్ సిటిజన్ సైన్స్ ప్రాజెక్టులో భాగస్వామి అయిన నికోలస్ ఎస్క్యూరాట్ అనే సామాన్య పౌరుడు ఈ స్ప్రైట్స్ ను తన సాధారణ కెమెరాలో బంధించడం విశేషం. వాటిని నాసా తన ఎక్స్ అకౌంట్ లో తాజాగా షేర్ చేసింది.
అతీత శక్తుల పనా?
ఈ వింత వెలుగులను అతీత శక్తులే సృష్టిస్తాయని చాలా మంది నమ్ముతుంటారు. అసలు ఆ వెలుగులు స్వయానా దెయ్యాలేనని విశ్వసించేవారికి కూడా కొదవ లేదు. అయితే అదంతా కేవలం అభూత కల్పన మాత్రమేనని సైంటిస్టులు స్పష్టం చేస్తున్నారు. ‘కుండపోత వర్షాల వేళ ఆకాశంలో కమ్ముకునే కరి మబ్బుల మీదుగా ఈ వెలుగులు పుట్టుకొస్తుంటాయి. అయితే ఇవి మన కంటికి కనిపించడమన్నది నిజానికి చాలా అరుదు. ఎందుకంటే ఉరుములు, మెరుపులమయంగా ఆ మబ్బులు సృష్టించే విలయమే ఆ వెలుగులను చాలాసార్లు కప్పేస్తూ ఉంటుంది. వీటిని స్పష్టంగా పట్టిస్తూ ఫొటోలు రావడం, అందులోనూ అవి తీసింది ఒక ఔత్సాహికుడు కావడం ఈ కారణం చేతనే చాలా విశేషమైనది‘ అని నాసా పేర్కొంది.
90 కి.మి. ఎత్తున...
ఈ స్ప్రైట్స్ మామూలు ఉరుములు, మెరుపుల మాదిరిగా తక్కువ ఎత్తులో ఏర్పడే బాపతు కావు. భూ ఉపరితలానికి ఏకంగా 50 నుంచి 90 కిలోమీటర్ల ఎత్తులో మెసోస్పియర్ లో పలుచని గాలి గుండా పుట్టుకొస్తాయి. దిగువన మేఘ మండలంలో పుట్టుకొచ్చే ఉరుములు, మెరుపుల వాతావరణం కారణంగా వీటి ఉత్పత్తి జరుగుతుంది. దిగంతాలను ధిక్కరిస్తూ అంతరిక్షంలో సుదూరాల దాకా విద్యుదయస్కాంత క్షేత్రాన్ని కదలబారుస్తాయి. దాంతో మెసోస్పియర్ లో విద్యుదావేశం భారీ పరిమాణంలో ఒక్కపాటున వచ్చిపడుతుంది. ఆ ఫలితమే ఈ స్ప్రైట్స్.
1989లో తొలిసారిగా...
ఈ స్ప్రైట్స్ ’ట్రాన్సియెంట్ ల్యూమినస్ ఈవెంట్స్’ తరహాకు చెందినవి. ఎగువ ఆకాశంలో ఈ తరహా వెలుగులను గురించి విమాన పైలట్లు దశాబ్దాలుగా రిపోర్ట్ చేస్తూనే వచ్చారు. అయితే వీటి తాలూకు కాస్తో కూస్తో స్పష్టమైన ఫోటో 1989లో తొలిసారిగా కెమెరాకు చిక్కింది. తాజాగా గత జూలై 5న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి నాసా వ్యోమగామి నికోలస్ అయెర్స్ శక్తిమంతమైన కెమెరాల బంధించిన రాకాసి స్ప్రైట్స్ తాలూకు అపరిమితమైన వెలుగులు అందరినీ విస్మయపరిచాయి. అంతకుముందు 2022లో ఇద్దరు ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లు టిబెట్ పీఠభూమి ఎగువన ఒకేసారి ఏకంగా 105 స్ప్రైట్స్ వెలుగులను కెమెరాల్లో బంధించారు. దక్షిణాసియా ప్రాంతం మీదుగా ఒకే విడతలో అత్యంత ఎక్కువ సంఖ్యలో పుట్టుకొచి్చన స్ప్రైట్స్ గా ఇవి నెలకొలి్పన రికార్డు ఇప్పటికీ పదిలంగానే ఉంది!


