చిటికెలో సినిమా.. ఫోన్‌తోనే! | Photography gadgets | Sakshi
Sakshi News home page

చిటికెలో సినిమా.. ఫోన్‌తోనే!

Jul 20 2025 5:24 PM | Updated on Jul 20 2025 6:01 PM

Photography gadgets

స్మార్ట్‌ ఫోన్‌ ఉందా? ఈ లెన్స్ తగిలించండి. మీ రూమ్‌ ఒక సెట్, మీరే డైరెక్టర్‌! ఆశ్చర్యపోతున్నారా! నిజం, ఈ చిన్న 1.33 ఎక్స్‌ అనామార్ఫిక్‌ లెన్స్ సాయంతో, మీ స్మార్ట్‌ఫోన్తోనే సినిమా తీయొచ్చు. పెద్ద కెమెరాలు, లైట్లు, సెటప్‌లు ఏవీ అవసరం లేదు. బెడ్‌రూమ్, హాల్, టెర్రస్‌... ఎక్కడైనా సినిమా లెవెల్‌ షాట్‌ తీయవచ్చు. ఇది రెండు రకాల లైటింగ్‌ ఎఫెక్ట్స్‌తో పనిచేస్తుంది. అందులో బ్లూ ఫ్లేర్‌ పెడితే ఇంట్లోనే స్పేస్‌ సినిమా ఫీల్, గోల్డ్‌ ఫ్లేర్‌ పెడితే శ్రావణ మాసం గుడిలో వచ్చే డివోషనల్‌ ఫీల్‌ కనిపిస్తుంది. ఒక్కసారి ఇది తీసిన వీడియో చూస్తూ ‘ఇది నిజంగా ఫోన్తో తీయగలరా?’ అని అశ్చర్యపోతారు. ఒక్కసారి వాడాక, మామూలు కెమెరా తెరవాలని కూడా అనిపించదు. ఇంకా ప్రత్యేకంగా డబ్బింగ్‌ చేయాల్సిన అవసరం లేదు. వీడియోలో సౌండ్‌ కూడా అద్భుతంగా రికార్డ్‌ అవుతుంది. ధర రూ.13,999 మాత్రమే!

జేబులో దీపావళి!

చుట్టూ చీకటి ఉన్నా, మీ ఇల్లు దీపావళి నాటి ఆకాశంలా మెరవాలంటే, మీ దగ్గర ఈ ‘డిజి టెక్‌ పోర్టబుల్‌ ఎల్‌ఈడీ లైట్‌’ ఉండాల్సిందే! చేతిలో పట్టేంత చిన్నదే, కాని ఆన్‌ చేస్తే మాత్రం మీ ముఖం, చుట్టూ ఉన్న వాతావరణం అంతా బ్రైట్‌గా మెరిసిపోతుంది. ఈ లైట్‌ సుమారు మూడు వేల నుంచి ఆరువేల కెల్విన్‌ వరకు వెలుతురును అందిస్తుంది. లైట్‌ బ్రైట్‌నెస్, రంగులను అవసరానికి అనుగుణంగా మార్చుకోవచ్చు. అలా చిత్రీకరణకు కావాల్సిన వాతావరణాన్ని సులభంగా సృష్టించవచ్చు. ఒక్కసారి చార్జ్‌ చేస్తే, నిర్విరామంగా సుమారు రెండు గంటలపాటు పని చేస్తుంది. ధర కేవలం రూ.1,299 మాత్రమే!

స్టూడియో బాక్స్‌!

చిన్న వస్తువులను ఫొటో తీయడం అంటే, ‘ఫ్యాన్ ఇండియా’ సినిమా తీసినంత ఈజీ కాదు. హోల్‌ లైట్, టేబుల్, షీట్, లో ఫ్యాన్ ... ఇలా చాలానే ప్లానింగ్‌ చేసి తీయాలి. అయితే, ఇప్పుడు ఈ హిఫిన్‌ ఫోల్డబుల్‌ లైట్‌ బాక్స్‌ ఉంటే చాలు, ఇంట్లోనే ఓ చిన్న సినిమాటిక్‌ ఫొటో స్టూడియో సెట్‌ రెడీ అవుతుంది. చూసేందుకు క్యూబ్‌లా ఉంటుంది. కాని, ఒక్కసారి తెరిస్తే, అంతా మాయలా మారిపోతుంది. ఫుల్‌ బ్రైట్‌ ఎల్‌ఈడీ లైట్లు మెరిసిపోతాయి. వాడటం కూడా చాలా సులభం యూఎస్‌బీకి పెట్టండి, ఎంత చిన్నవస్తువునైనా మధ్యలో పెట్టండి, ఫోటో తీయండి... అంతే! పైగా ఈ బాక్స్‌ను మడిచి పెట్టుకోవచ్చు, ఎక్కడికైనా తేలికగా తీసుకెళ్లవచ్చు. ఇందులో పెట్టి ఫొటో తీస్తే తెలుపు, నలుపు రంగుల బ్యాక్‌డ్రాప్‌లతో ఫొటోలకు పూర్తిగా ప్రొఫెషనల్‌ టచ్‌ ఇస్తుంది. ధర రూ.499 మాత్రమే!

తిరిగే ఎలక్ట్రిక్‌ స్టాండ్‌!

వస్తువుల ఫొటో తీయాలంటే చేతితో తిప్పుతూ తిప్పుతూ మీ తల తిరగాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఈ తిరిగే ఎలక్ట్రిక్‌ స్టాండ్‌పై వస్తువును పెట్టి ఫొటో తీయండి. మెల్లగా 360 డిగ్రీలుగా తిరుగుతూ, ఏ కోణంలో చూసినా వస్తువును అందంగా చూపిస్తుంది. కావాల్సిన రీతిలో వస్తువు యాంగిల్, దిశ, వేగాన్ని సులభంగా నియంత్రించవచ్చు. ఇది బంగారు వస్తువులు, గడియారాలు, చిన్న కేకులు, ప్రదర్శన వస్తువుల ఫొటోగ్రఫీకి అద్భుతంగా ఉపయోగపడుతుంది. సుమారు ఎనిమిది కిలోల బరువు వరకు కోరుకున్న దిశలో తిప్పగలదు. దీనిని ఉపయోగించడం చాలా సులువు. ధర రూ. 1,699 మాత్రమే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement