కొత్త దారి
పాత రోత–కొత్త వింత’ అనే సామెత ఉంది. కొత్త వింతల సంగతి ఎలా ఉన్నా పాత రోత’ అనుకోవడం లేదు యువతరంలో కొద్దిమంది. కొత్త సంవత్సరంలో ఎక్కువ మంది గాడ్జెట్‌లకు సంబంధించి ‘పాతపాఠశాల’కు తిరిగి వస్తారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
తన వయసు పిల్లలు నెట్‌ఫ్లిక్స్ షోలలో మునిగితేలుతుంటే పదిహేడు సంవత్సరాల నిహాల్‌కు మాత్రం పాత డివీడీలు అంటేనే చాలా ఇష్టం. తాత, మామలు సేకరించిన పాత సినిమాల డీవీడీలు అతడికి నిధితో సమానం. అరుదైన డీవిడీల కోసం ముంబై వీధుల్లో తిరిగే నిహాల్ ఇప్పటి వరకు ఎన్నో డీవీడీలు కొనుగోలు చేశాడు. ‘అరుదైన డీవీడీలు కొనుగోలు చేయడం, వాటిని ఇతరులకు గర్వంగా చూపడం సంతోషంగా ఉంటుంది’ అంటున్నాడు నిహాల్.
ఫాస్ట్‌గా పాత గ్యాడ్జెట్స్
పాత డీవిడీలు మాత్రమే కాదు, పాత వినైల్ రికార్డ్‌లు,పాత కాలం ఫిజికల్ కెమెరాలు, పాత నాణేలు సేకరించేవారు యువతరంలో ఎందరో ఉన్నారు. ఇదొక రకమైన ట్రెండ్. ఈ ట్రెండ్‌లాంటిదే న్యూట్రో(నోస్టాల్జీయా ప్లస్ మోడ్రన్‌లైఫ్) ట్రెండ్. ఈతరం పిల్లలకు పాత గాడ్జెడ్స్‌పై (Old Gadgets) ఉండే పాషన్‌ను ‘న్యూట్రో’ ట్రెండ్ అంటున్నారు. ‘న్యూట్రో’ అనేది ఆధునిక జీవితంలో నోస్టాల్జియాను మిళితం చేసే సంస్కృతి. పాత గాడ్జెట్స్ పాస్ట్‌గా తిరిగిరావడానికి ఈ ట్రెండే కారణం.
పాత గ్యాడ్జెట్స్.. ఫ్యాషన్ స్టేట్‌మెంట్
ఏఐ స్మార్ట్‌ఫోన్ లెన్స్ ఉన్నప్పటికీ యువత ఫిల్మ్ కెమెరాలపై ఆసక్తి చూపుతున్నారు. పాత మోడల్ ఫ్లిప్ ఫోన్‌లు సరికొత్త ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌గా మారాయి. ఈ ట్రెండ్ 2026లో శిఖరాగ్రానికి చేరుకుంటుందని సోషల్ మీడియా ఎక్స్‌పర్ట్‌లు చెబుతున్నారు. అత్యాధునిక వీడియో గేమ్ కన్సోల్స్ ఎన్ని వచ్చినప్పటికీ బెంగళూరుకు చెందిన విశాల్‌తేజాకు 2005 కాలానికి చెందిన పీఎస్‌పీ(ప్లేస్టేషన్ పోర్టబుల్) అంటేనే ఇష్టం. సోనీ కంపెనీ వారి ఈ హ్యాండ్‌హెల్డ్ గేమింగ్ కన్సోల్ లాంచ్ అయిన కొద్దికాలంలోనే సూపర్‌హిట్ అయింది. ‘నేను చూసిన, ఆడుకున్న మొట్ట మొదటి గేమ్ కన్సోల్ పీఎస్‌పీ. ఇది మా ఇంటి వస్తువులా అనిపిస్తుంది. ఇప్పటి వరకు ఎన్ని కన్సోల్స్ వచ్చినా పీఎస్‌పీ అంటేనే ఇష్టం’ అంటున్నాడు విశాల్‌తేజ.
ఎందుకీ వైబ్?
ఎన్నో అత్యాధునిక గ్యాడ్జెట్స్ ఉన్నా, యువతరంలో కొద్దిమంది పాత గాడ్జెట్స్‌ను ఎందుకు అపురూపంగా చూస్తున్నారనే ప్రశ్నకు వారి మాటల్లోనే జవాబు దొరుకుతుంది. మచ్చుకు కొన్ని... పాత గాడ్జెట్‌లే సౌకర్యంగా ఉన్నాయి’ ‘ప్రైవసీ కోసం’‘ పరుగులు తీస్తున్నట్లుగా లేదు. ప్రశాంతంగా నడుస్తున్నట్లుగా ఉంటుంది’
‘డిస్‌కనెక్ట్ థ్రిల్ ఆస్వాదించడానికి’
‘2005 కాలానికి చెందిన ఫోన్‌లలో కాన్‌స్టంట్‌గా నోటిఫికేషన్‌లు ఉండేవి కావు. ప్రశాంతంగా ఉండేది. అందుకే వాటిని ఇష్టపడుతున్నాం’ ‘మోడ్రన్ టెక్‌తో పోల్చితే పాత డివైజ్‌లలో సింప్లిసిటీ–సెల్ప్ కంట్రోల్ ఉంటుంది’
∙∙∙
డిజిటల్ డిటాక్స్ కల్చర్ పెరిగిపోవడంతో దాని నుంచి బయటపడడానికి యువతలో కొద్దిమంది పాత ‘ఫ్లిప్ ఫోన్’లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ‘ఒకసారి వెనక్కి వెళదాం. వెళితే ఎలా ఉంటుందో తెలుసా? ఎలాంటి ఆందోళన ఉండదు. ఉరుకులు, పరుగులు ఉండవు. టైమ్ వృథా కాదు’ అంటూ ‘డంబ్‌ఫోన్’లపై ‘రీల్స్’ చేస్తున్నారు కొందరు. న్యూట్రోలాజిక్‌లో పాత సాంకేతికత కేవలం నోస్టాల్జిక్ ఫీలింగ్ మాత్రమే కాదు. సురక్షితంగా, సౌలభ్యంగా అనిపించే ఫీలింగ్. యువతరం పాత టెక్నాలజీని ఉపయోగించడమే కాదు దాన్ని రొమాంటిసైజ్ చేయడం మరో విశేషం.


