ఆ్రస్టేలియా టీనేజర్ల డిజిటల్ స్వేచ్ఛపై నిషేధం
డిసెంబరు 10 బుధవారం సూర్యోదయం కాగానే, ఆ్రస్టేలియా చరిత్రలో తొలిసారిగా ఒక చట్టం అమల్లోకి రానుంది. దేశంలోని 16 ఏళ్ల లోపు యువతకు సోషల్ మీడియా తలుపులు మూసుకుపోతాయి. అయితే, ప్రపంచంలోనే ఈ తొలి నిషేధం, రిలే అలెన్ అనే 15 ఏళ్ల స్కూల్ బాయ్‌కి నిద్ర లేకుండా చేస్తోంది. దక్షిణ ఆ్రస్టేలియాలోని కేవలం 1,000 మంది జనాభా ఉన్న ’వుడిన్నా’ అనే చిన్న కమ్యూనిటీకి 5 కిలోమీటర్ల దూరంలో రిలే కుటుంబం నివసిస్తోంది. గొర్రెల ఫారంలో నివసించే ఈ కుర్రాడికి, దూరంగా ఉన్న స్నేహితులతో మాట్లాడడానికి సోషల్ మీడియానే ఏకైక మార్గం. బుధవారం అర్ధరాత్రి దాటితే, 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన సహాధ్యాయులతో ఎలా అందుబాటులో ఉండాలి?.. ఒక్క మీట నొక్కగానే.. తమ ప్రపంచం తెగిపోతుందనే భయం ఈ పల్లెటూరి పిల్లాడిని వెంటాడుతోంది.
ఉల్లంఘిస్తే భారీ జరిమానా
బుధవారం నుంచి 16 ఏళ్లలోపు ఉన్నవారు ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, కిక్, రెడ్డిట్, స్నాప్‌చాట్, త్రెడ్, టిక్‌టాక్, ఎక్స్, యూట్యూబ్, ట్విచ్ తదితర ప్లాట్‌ఫాంలలో ఖాతాలను కలిగి ఉండకుండా చట్టం నిషేధిస్తుంది. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే, ఆయా ప్లాట్‌ఫాంలపై 32.9 మిలియన్ల వరకు భారీ జరిమానాలు విధిస్తారు. ‘మెటా’.. ఇప్పటికే అనుమానిత యువకుల ఖాతాలను తొలగించడం ప్రారంభించింది. రిలేకు.. ఇంకా నోటిఫికేషన్ రాలేదు, కానీ ఏ క్షణమైనా తనను తొలగిస్తారేమోనని భయపడుతున్నాడు.
ఇదీ చదవండి: ఉల్లి, వెల్లుల్లి తెచ్చిన తంటా, 11 ఏళ్ల బంధానికి స్వస్తి
నా కొడుక్కి సాయం చేసేదే లేదు..
రిలే తల్లి, స్కూల్ టీచర్ అయిన సోనియా అలెన్ మాత్రం.. నిషేధాన్ని తప్పించుకోవడానికి తన కొడుక్కి సహాయం చేయనని స్పష్టం చేసింది. అయితే, ఇతర తల్లిదండ్రులు సహాయం చేస్తారని ఆమె అనుమానం వ్యక్తం చేసింది. గతంలో రిలే.. అర్ధరాత్రి వరకు సోషల్ మీడియాలో మునిగితేలుతూ హోంవర్క్ చేయనందుకు, రెండు నెలలపాటు అతని సోషల్ మీడియాను ఆమె నిషేధించింది. ‘అప్పటినుంచే తన కొడుకు మరింత బాధ్యతాయుతంగా సోషల్ మీడియాను ఉపయోగించడం నేర్చుకున్నాడు’.. అని అలెన్ గుర్తు చేసుకుంది. ఏప్రిల్‌లో 16 సంవత్సరాలు నిండనున్న రిలే.. ఈ నిషేధం లక్ష్యాలను అర్థం చేసుకున్నానని, అయితే వాటిని సాధించడానికి ఇతర మార్గాలు కూడా ఉన్నాయని స్పష్టం చేశాడు. చిన్న పిల్లలు నిద్రకు దూరం కాకుండా, రాత్రి 10 గంటల నుండి సామాజిక మాధ్యమాల వినియోగాన్ని తప్పనిసరిగా నిషేధించాలని సూచించాడు.
హైకోర్టులో టీనేజర్ల పోరాటం
రిలేకు.. ఆస్ట్రేలియాలోని అతిపెద్ద నగరమైన సిడ్నీలో ఒక మిత్రుడు ఉన్నాడు. ఆగస్టులో 16 ఏళ్లు వచ్చే నోహ్ జోన్స్. మరో విద్యారి్థని మేసీ నైలాండ్‌లు ఈ చట్టాన్ని హైకోర్టులో సవాలు చేస్తున్నారు. ఈ చట్టం అక్రమంగా 2.6 మిలియన్ల యువ ఆ్రస్టేలియన్ల రాజకీయ భావవ్యక్తీకరణ స్వేచ్ఛ హక్కును లాగేసుకుంటుందని వారు వాదిస్తున్నారు. కాగా, సోషల్ మీడియా వల్ల తమ పిల్లలకు కలుగుతున్న హానిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారని ఆ్రస్టేలియా ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు ఈ సోషల్ మీడియా నిషేధాన్ని వ్యతిరేకిస్తూ 140 మందికి పైగా అంతర్జాతీయ విద్యావేత్తలు.. ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌కు రాసిన బహిరంగ లేఖపై సంతకం చేశారు.
ఇదీ చదవండి: పెళ్లి వేడుకలో అపశృతి : ఒక్కసారిగా కూలిన పైకప్పు
నిషేధం దాటేస్తారు: నిపుణుల హెచ్చరిక
డిజిటల్ ఫ్రీడమ్ ప్రాజెక్ట్ అధ్యక్షుడు జాన్ రూడిక్.. ఈ నిషేధం అమలులోకి రాకుండా కోర్టు నిషేధాజ్ఞ కోసం ప్రయతి్నంచాలని భావించారు, కానీ న్యాయవాదుల సలహా మేరకు విరమించుకున్నారు. ఈ రాజ్యాంగ సవాలుపై పూర్తిస్థాయి విచారణ ఫిబ్రవరి చివరిలో జరగనుంది. పిల్లలు ఈ నిషేధాన్ని తప్పించుకోవడానికి వీపీఎన్‌లను ఉపయోగించి తమ స్థానాన్ని మార్చుకుంటారని ఆయన అంచనా వేశారు. ‘పిల్లలు దీన్ని తప్పించుకుంటారు, ఆ తర్వాత వారు తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకుండా, మరింత ప్రమాదకరమైన ’అండర్‌గ్రౌండ్’ సోషల్ మీడియాను ఉపయోగిస్తారు’.. అని రూడిక్ హెచ్చరించారు.
– సాక్షి, నేషనల్ డెస్క్


