ప్రపంచంలో.. మొట్టమొదటిసారిగా టీనేజర్లకు సోషల్ మీడియాను బ్యాన్ చేస్తోంది ఆస్ట్రేలియా. మరో రెండు రోజుల్లో (డిసెంబర్ 10) ఈ సంచలనాత్మక నిర్ణయం ఆచరణలోకి రానుంది. ఈ దరిమిలా ప్రపంచమంతా ఇది ఎలా అమలు కానుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అయితే మిగతా దేశాలు తమ బాటలో పయనిస్తాయని తానేం ఆనుకోవడం లేదని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ అంటున్నారు. అంతేకాదు.. తాము తీసుకున్నది పరిపూర్ణమైన నిర్ణయమేమీ కాదని కూడా ఆసక్తికర వ్యాఖ్యలే చేశారాయన.
ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు చిన్నారులకు సో.మీ. నిషేధంపై తాజాగా ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘‘ఇది తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమేమీ కాదని స్పష్టత ఇచ్చారు. ‘‘ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనుకుంటే మీరు పొరపడినట్లే. సో.మీ. ప్రభావం వల్ల ప్రభావితమైన.. వ్యక్తిగతంగా విషాదాల్ని ఎదుర్కొన్న తల్లిదండ్రులు కోరుకున్న మార్పు ఇది. మరికొందరు తల్లిదండ్రులు అలాంటి శోకం అనుభవించకూడదనే ఉద్దేశంతో వాళ్లు ఈ చట్టం రావాలని కోరుకున్నారు. ఇది తల్లిదండ్రుల బాధను గౌరవిస్తూ.. సోషల్ మీడియా కంపెనీలను బాధ్యత వహించేలా చేసే చట్టం’’ అని అల్బనీస్ పేర్కొన్నారు.
..అలాగని మేం దీనిని పరిపూర్ణమైన నిర్ణయం అని అనుకోవడం లేదని కూడా చెబుతున్నారు. ఈ చట్టంలో లోపాలున్నా ప్రాణాలను మాత్రం రక్షిస్తుందని అంటన్నారు. ఈ మేరకు పిల్లల భద్రతకు అవసరమైన అడుగుగా భావిస్తున్నాం అని అన్నారాయన. పిల్లల మానసిక ఆరోగ్యం .. భద్రత నేపథ్యాలే ఈ నిషేధం వెనుక ప్రధాన ఉద్దేశ్యం అని స్పష్టం చేశారు. ప్రపంచ దేశాలు ఈ నిర్ణయాన్ని అనుసరించాలని కోరుకుంటున్నారా? అని అడగా.. అలా తాము భావించడం లేదని, అది ఆయా దేశాల పరిస్థితులను బట్టి ఉంటుందని.. అయితే పాటిస్తే మాత్రం తప్పకుండా మేలే జరుగుతుందని అంటున్నారు.
సోషల్ మీడియా వాడకానికి మినిమమ్ ఏజ్ (Online Safety Amendment Bill 2024)ను గుర్తిస్తూ.. ప్రపంచంలోనే మొదటిసారి అమలు కాబోతోంది. దీని ప్రకారం.. 16 ఏళ్ల లోపు పిల్లలకు ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్, యూట్యూబ్, స్నాప్‌చాట్, ఫేస్‌బుక్, థ్రెడ్స్, ఎక్స్(ట్విటర్) వంటి ప్రధాన ప్లాట్‌ఫారమ్‌లలో అకౌంట్‌లు ఉండకూడదు. ఎడ్యుకేషన్, ప్రొఫెషనల్ సైట్లకు మాత్రం అనుమతి ఉంటుంది. టెక్ కంపెనీలు ఈ నిబంధనను పాటించకపోతే భారీ జరిమానాలు($49.5 మిలియన్.. మన కరెన్సీలో రూ.4,500 కోట్ల దాకా జరిమానా) చెల్లించాల్సి వస్తుంది.
తల్లిదండ్రుల బాధను విన్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని అల్బనీస్ మరోమారు స్పష్టం చేశారు. పిల్లలను ఆన్‌లైన్ బులీయింగ్(వేధింపులు), హానికర కంటెంట్‌కు దూరంగా ఉంచడం.. తద్వారా మానసిక ఒత్తిళ్ల నుండి పరిరక్షించడం ఈ చట్టం ప్రధాన లక్ష్యాలని ఆల్బనీస్ ఉద్ఘాటించారు. స్క్రీన్‌లకు అతుక్కుపోకుండా.. పిల్లలు ఆటలు, సంగీతం, పుస్తకాలు వంటి నిజజీవిత కార్యకలాపాల్లో పాల్గొనాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు.
సవాళ్లు..
వయసు ధృవీకరణ కోసం సాంకేతికతను ఉపయోగిస్తామని.. సంబంధిత డాక్యమెంట్లనూ పరిశీలిస్తామని సో.మీ. ప్లాట్‌ఫారమ్‌లు చెబుతున్నాయి. అయితే.. అదెంత వరకు వీలవుతుందో? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పిల్లలు వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్(VPN)లు వాడడమో.. లేదంటో ఫేక్ అకౌంట్‌లు వాడో నిబంధల్ని అతిక్రమించే అవకాశం లేదా? అనేది మున్ముందు తెలిసేది.
రియాక్షన్లు ఇవిగో..
టీనేజర్ల సో.మీ. స్వేచ్ఛకు అడ్డుకట్ట వేస్తున్న ఈ చట్టం.. ఓ అతినియంత్రణేనని కొందరు ఆస్ట్రేలియన్ మైనర్లు ఇప్పటికే కోర్టులను ఆశ్రయించారు. ఆ పిటిషన్లు ప్రస్తుతానికి విచారణ దశలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అమెరికా, యూరప్, ఆసియా దేశాల్లోని యువత నుంచి ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందన వినిపిస్తోంది. కొంతమంది టీనేజర్లు ఈ నిషేధం వల్ల ఆన్‌లైన్ బులీయింగ్, హానికర కంటెంట్ తగ్గుతుందని భావిస్తున్నారు. మరికొందరు ఇది వ్యక్తిగత స్వేచ్ఛను హరించేదిగా చూస్తున్నారు. అయితే ఇంకొందరు మాత్రం “ఇది బ్లాక్ అండ్ వైట్ విషయం కాదు” అని.. అంటే పూర్తిగా మంచిదీ చెడిదీ అని చెప్పలేమని అభిప్రాయపడ్డారు.


