ఇంట్లో భార్య ఉండగానే గాల్‌ఫ్రెండ్‌తో కలిసి థాయిలాండ్ టూరుకు వెళ్లిన ప్రబుద్ధుడొకరు ఊహించని రీతిలో దొరికిపోయాడు. భార్యతో బిజినెస్ టూర్ అని చెప్పి రహస్య స్నేహితురాలితో షికారుకెళ్లిన అతగాడిని అనూహ్యంగా ప్రకృతి పట్టించింది. ఏంటి నమ్మడం లేదా? అయితే నేరుగా స్టోరీలోకి వెళ్లిపోదాం పదండి.
మలేసియాకు చెందిన ఓ వ్యక్తి ఇటీవల తన సహోద్యోగులతో కలిసి బిజినెస్ ట్రిప్ (business trip) వెళుతున్నట్టు భార్యతో చెప్పి థాయిలాండ్ వెళ్లాడు. దక్షిణ థాయిలాండ్‌లోని అతిపెద్ద నగరమైన హాట్ యాయ్‌కు వెళ్లినట్టు భార్యకు తెలిపాడు. కడుపుతో ఉన్న భార్యకు ఎప్పటికప్పుడు తన ప్రయాణానికి సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తుండేవాడు. దీంతో ఆమెకు ఎటువంటి అనుమానం కలగలేదు. ఇక్కడి వరకు అంతా బాగానే మేనేజ్ చేశాడు. కానీ తర్వాత కథ అడ్డం తిరిగింది. ప్రకృతి కన్నెర్ర చేయడంతో తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయిందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించింది.
ఊహించని విధంగా భారీ వర్షాలు థాయిలాండ్‌ను అతలాకుతలం చేశాయి. కుండపోత వర్షాలతో దక్షిణ హాట్ యాయ్ నగరంతో పాటు 12 ప్రావిన్సులలో భారీ వరదలు సంభవించాయి. 80 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 30 లక్షల మంది వరకు నిరాశ్రయులయ్యారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న మలేసియా మహిళ ఒకరిని సదరు భర్తగారి భార్య సాయం కోసం అభ్యర్థించింది. వరదల్లో చిక్కుకున్న తన భర్తను కాపాడాలని కోరింది. అతడికి సంబంధించిన వివరాలు కూడా తెలిపింది. ఆమె అభ్యర్థనతో భర్తను కాపాడేందుకు అతడు బస చేసిన హోటల్‌కు వెళ్లిన మలేసియా మహిళకు వింత అనుభవం ఎదురైంది. మనోడు ఉన్నది సహోద్యోగులతో కాదని, గాల్‌ఫ్రెండ్‌తో అన్న విషయం బయటపడింది. నాలుగు రోజులుగా వారిద్దరూ ఒకే గదిలో ఉన్నట్టు గుర్తించారు.
భార్యలూ జాగ్రత్త..
సదరు మహిళ ఈ విషయాన్ని అతడి భార్యకు చెప్పలేదు. ఎందుకంటే ఆమె గర్భిణి, పైగా తండ్రి రాకకోసం ఆమె ముగ్గురు పిల్లలు ఎదురు చూస్తున్నారు. తనకెదురైన అనుభవాన్ని సోషల్ మీడియా (Social Media) ద్వారా బయట ప్రపంచానికి తెలియజేసింది. భర్తలను గుడ్డిగా నమ్మే భార్యలను అప్రమత్తం చేయడానికే ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టు వివరించారామె. "జాగ్రత్తగా ఉండండి. మన భర్తలను గుడ్డిగా నమ్మవద్దు" అని ఆమె పేర్కొంది.
చదవండి: 'ప్యూర్ వెజిటేరియనా.. ఏదో మిస్సవుతున్నారు'
భార్యకు చెప్పాల్సిందే..
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ (Viral) కావడంతో చర్చకు దారితీసింది. భర్త బాగోతం గురించి భార్యకు చెప్పాల్సిందేనని పలువురు నెటిజనులు కామెంట్ చేశారు. కొంతమంది మాత్రం.. భార్య కుటుంబ సభ్యుడికో, స్నేహితులకో తెలియజేయాలని సూచించారు. ఇలాంటి వాళ్లకు తగిన శాస్తి చేయాలని మరికొందరు ఫైర్ అయ్యారు. చూడాలి మనోడి పరిస్థితి ఏంటో!


