టాంగ్ టోరు: ఇండోనేషియా, శ్రీలంక, థాయ్‌లాండ్‌లలో భారీ వర్షాలతో గత వారం సంభవించిన ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో మరణించిన వారి సంఖ్య 1,300 దాటింది. 800 మందికి పైగా గల్లంతయ్యారు. ఇండోనేషియాలో 712 మంది, శ్రీలంకలో 410 మంది, థాయ్‌లాండ్‌లో 181 మంది మరణించినట్లు అధికారులు మంగళవారం తెలిపారు.
ఇండోనేషియాలో..
ఇండోనేషియాలోని సుమత్రా దీవులు తీవ్రంగా నష్టపోయాయి. రోడ్లు కొట్టుకుపోయాయి. వంతెనలు కూలిపోయాయి. 507 మంది గల్లంతైనట్లు ఆ దేశ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. తప్పిపోయారు. ఉత్తర సుమత్రాలో వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల లక్షలాది క్యూబిక్ మీటర్ల కలప కొట్టుకుపోయిందని అధికారులు తెలిపారు. చెట్లను అక్రమంగా నరికివేయడం విపత్తుకు కారణమై ఉంటుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రకృతి వైపరీత్యం మాత్రమే కాదని, మానవ నిర్మిత సంక్షోభమని ఇండోనేషియా పర్యావరణ ఫోరం ఆరోపించింది. తక్షణ పునరుద్ధరణ, కట్టుదిట్టమైన రక్షణ లేకపోతే వరదలు సాధారణమవుతాయని హెచ్చరించింది.
ప్రాణ నష్టాన్ని ఇప్పుడే నిర్ణయించలేం: శ్రీలంక అధ్యక్షుడు
ఇది దేశాన్ని ముంచెత్తిన అత్యంత దారుణమైన విపత్తని శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సానాయకే అన్నారు. ప్రాణనష్టాన్ని ఇప్పుడే నిర్ణయించలేమన్నారు. మరణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని ఆయన హెచ్చరించారు. వరదల్లో, కొండ చరియలు విరిగి పడటంతో చిక్కుకుపోయినవారిని చేరుకోవడానికి ప్రభుత్వ సంస్థలు కృషి చేస్తున్నాయన్నారు. కొందరు మొత్తం కుటుంబాన్నే కోల్పోయారని ఆవేదన
వ్యక్తం చేశారు.
థాయ్‌లాండ్‌లో పబ్లిక్ కిచెన్‌లు..
థాయ్‌లాండ్‌లో భారీ వరదలు 15 లక్షలకు పైగా ఇళ్లను మంచెత్తాయి. 39 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. వారికి మౌలిక సదుపాయాలను పునరుద్ధరించడానికి అధికారులు కృషి చేస్తున్నారు. బాధితులకు ఆహారాన్ని అందించడానికి పబ్లిక్ కిచెన్‌లను ఏర్పాటు చేస్తామని థాయ్‌లాండ్ ప్రభుత్వం తెలిపింది. మొదటి దశలో రూ.74 లక్షల నష్టపరిహారం 26,000 మందికి పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వ ప్రతినిధి సిరిపోంగ్ అంగ్కసకులి్కయాట్ తెలిపారు.


