ఢిల్లీ: శ్రీలంకకు సాయం చేసే విషయంలో దాయాది దేశం పాకిస్తాన్ మీడియా తప్పుడు ప్రచారాన్ని భారత్ ఖండించింది. దిత్వా తుపాను కారణంగా దెబ్బతిన్న శ్రీలంకకు సాయం చేసేందుకు గగనతల అనుమతి కోరినప్పటికీ.. భారత్ అనుమతించలేదని పాక్ మీడియా ఫేక్ ప్రచారం చేసింది. అయితే, ఇది అసత్య ప్రచారమని భారత్ క్లారిటీ ఇచ్చింది.
వివరాల ప్రకారం.. దిత్వా తుపాను నేపథ్యంలో శ్రీలంకకు సాయం చేయడానికి పాక్.. భారత గగనతలం నుంచి ప్రయాణించేందుకు సాయం కోరింది. సోమవారం భారత్‌ను సంప్రదించింది. అనంతరం, తమకు భారత్ అనుమతి ఇవ్వలేదని పాక్ మీడియా తప్పుడు ప్రచారం అందుకుంది. ఈ నేపథ్యంలో పాక్ మీడియా ప్రచారాన్ని భారత్ ఖండించింది. ఈ సందర్బంగా భారత్.. మన గగనతలంలో ప్రయాణించేందుకు సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు పాక్ సంప్రదించిందని, సాయంత్రం 5.30 గంటలకు భారత్ అనుమతి ఇచ్చిందని, అధికారిక ఛానల్ ద్వారా ఈ సమాచారం చేరవేసినట్లు అధికారులు పేర్కొన్నారు. మానవతా దృక్పథంతోనే అనుమతులు ఇచ్చినట్లు భారత్ స్పష్టం చేసింది. ఇది అసత్య ప్రచారమని భారత అధికారులు పేర్కొన్నారు. ఇది తప్పుదారి పట్టించే వార్తలు అని తెలిపారు.
ఇదే సమయంలో గగనతల సంబంధిత నిర్ణయాలకు సంబంధించి భారత్ ప్రామాణిక కార్యచరణ, సాంకేతిక, భద్రతా అంచనాలను పరిగణనలోకి తీసుకుంటుందని, రాజకీయ కోణంలో అనుమతుల నిరాకరణ ఉండదని అధికారులు పేర్కొన్నారు. పాక్ విమానాలు భారత గగనతలం మీదుగా ప్రయాణించేందుకు వీలు లేనప్పటికీ పూర్తి మానవతా కోణంలో ఆలోచించి అనుమతులు ఇచ్చినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. పాక్ మీడియా నివేదికలు పూర్తిగా తప్పుఅని, బాధ్యత రాహిత్యమైనవని అధికారులు వివరించారు.
ఇదిలా ఉండగా.. దిత్వా తుపాను కారణంగా శ్రీలంక అతలాకుతలమైంది. ఎడతెరిపిలేని వర్షం కారణంగా పలు ప్రాంతాలు నీట మునిగాయి. వందల సంఖ్యలో మరణాలు చోటుచేసుకున్నాయి. అలాగే, వరద నీటిలో పలువురు గల్లంతయ్యారు. ఇటీవలి కాలంలో శ్రీలంకలో ఇంతటి పెను ముప్పు రాలేదని అధికారులు చెబుతున్నారు. దిత్వా కారణంగా తీవ్ర నష్టం వాటిల్లినట్టు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


