దిత్వా తుపాను.. శ్రీలంక అతలాకుతలం | Cyclone Ditwah Effect On Sri Lanka | Sakshi
Sakshi News home page

దిత్వా తుపాను.. శ్రీలంక అతలాకుతలం

Dec 1 2025 11:10 AM | Updated on Dec 1 2025 11:21 AM

Cyclone Ditwah Effect On Sri Lanka

కొలంబో: దిత్వా తుపాను బీభత్సం ధాటికి శ్రీలంక అతలాకుతలమైంది. భారీ వర్షాల కారణంగా 334 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో మరో 370 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని శ్రీలంక జాతీయ విపత్తు నిర్వహణ కేంద్రం (డీఎంసీ) వెల్లడించింది. దాదాపు 11.18 లక్షల మందిపై విపత్తు ప్రభావం పడిందని తెలిపింది.

దిత్వా తుపాను ప్రభావం శ్రీలంకపై కొనసాగుతోంది. తుపాను కారణంగా లంకేయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎడతెరిపిలేని వర్షంతో వరదలు రావడం, కొండచరియలు విరిగిపడటం వల్ల ఎక్కువగా ప్రాణ నష్టం జరిగింది. ఒక్క కాండీ జిల్లాలోనే 88 మంది మృతి చెందగా.. 150 మంది కనిపించకుండా పోయారు. బదుల్లాలో 71 మంది మృతి చెందారు. డీఎంసీ ప్రకారం ఈ తుపాను.. దేశవ్యాప్తంగా 3,09,607 కుటుంబాలను ప్రభావితం చేసింది. ఇక, ఇటీవలి కాలంలో శ్రీలంకలో అత్యంత తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాలలో ఈ తుపాను నిలిచింది. వరదల కారణంగా పలు పట్టణాలు మునిగిపోయాయని, ప్రధాన వంతెనలు కొట్టుకుపోయాయని, మౌలిక సదుపాయాలకు ఆటంకం కలిగిందని అధికారులు చెబుతున్నారు.

మరోవైపు.. దిత్వా నేపథ్యంలో ‘ఆపరేషన్‌ సాగర్‌ బంధు’ పేరుతో శ్రీలంకలో భారత్‌ చేపడుతున్న సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఐఎన్‌ఎస్‌ విక్రాంత్, రెండు చేతక్‌ హెలికాప్టర్లతో పాటు 80 మంది జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) సిబ్బందిని శ్రీలంకకు పంపినట్లు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ వెల్లడించారు. అంతకు ముందురోజు వాయుసేనకు చెందిన సీ-130జే, ఐఎల్‌ 76 విమానాలు 21 టన్నుల సహాయ సామగ్రిని శ్రీలంకకు తరలించాయి.

కొలంబో విమానాశ్రయంలో చిక్కుకుపోయిన 323 మంది భారతీయులను ఆదివారం రవాణా విమానాల్లో స్వదేశానికి తరలించారు. 247 మంది తిరువనంతపురానికి, 76 మంది దిల్లీకి చేరుకున్నారు. వరద ప్రాంతాల్లో చిక్కుకున్న భారతీయుల్లో 45 మందిని భారత వాయుసేన (ఐఏఎఫ్‌) హెలికాప్టర్లు కొలంబోకు తరలించాయి. ప్రభావిత ప్రాంతాలకు 57 మంది శ్రీలంక సైనికుల్ని కూడా ఐఏఎఫ్‌ తరలించింది. శ్రీలంకలో చిక్కుకున్న భారతీయులెవరైనా అత్యవసర హెల్ప్‌డెస్క్‌ను +94 773727832 నంబరులో సంప్రదించాలని అధికారులు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement