సాక్షి, అమరావతి: నైరుతి బంగాళాఖాతంలో 'దిత్వా' తుపాను ఏపీ వైపు దూసుకొస్తుంది. దిత్వా తుపాను తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా కదులుతూ మరికాసేపట్లో తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. కరైకాల్‌కు 120, పుదుచ్చేరికి 90, చెన్నైకు 150 కి.మీ. దూరంలో ప్రస్తుతం తుపాను కేంద్రీకృతమైంది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు, ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
తుపాన్ ప్రభావంతో ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయ్యింది. గడిచిన 6 గంటల్లో 5 కి.మీ వేగంతో తుపాను కదిలింది. భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చర్యగా నెల్లూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లోని అన్ని విద్యాసంస్థలకు నేడు సెలవు ప్రకటిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. బాపట్ల జిల్లా చీరాలలో దిత్వా తుపాను ప్రభావంతో మరోసారి బీచ్ మూతపడింది. సముద్ర స్నానాలకు యాత్రికులు రావద్దంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వాడరేవు, రామాపురం, పొట్టిసుబ్బాయపాలెం, విజయలక్ష్మిపురంలో పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

నేడు దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 45-65 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈరోజు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
సోమవారం ఈ జిల్లాల్లో వర్షాలు..
ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు ఉన్నాయి. డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్ కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురవొచ్చని చెప్పారు.

మంగళవారం వర్షాలు ఇలా..
బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తోంది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడొచ్చని అన్నారు. తీరం వెంట గరిష్ఠంగా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుల ప్రభావం ఉండొచ్చని వాతావరణ శాఖ చెప్పింది.


